ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా కన్నా లక్ష్మీనారాయణకు రాష్ట్ర పగ్గాలు అప్పగించారు. అయితే, ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఈ మధ్య ఏపీ భాజపా నేతలు మాటల దాడి బాగానే పెంచారు. టీడీపీ, వైకాపాలతో సమాన సంఖ్యలో ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఏపీ భాజపా నేతలు ప్రతీరోజూ వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మోడీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో నేతలు మరింత యాక్టివ్ గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఎన్నికల దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి భాజపాలోకి కొన్నైనా వలసలు ఉంటే… రాష్ట్ర నాయకత్వం సమర్థంగా పనిచేస్తోందని చెప్పుకోవచ్చు. కానీ, ఉన్న ఆ కొద్దిమంది నేతల్లో కొందరు పక్కచూపులు చూస్తున్నారంటూ ప్రచారం మొదలుకావడం రాష్ట్ర నాయకత్వ లోపంగానే కనిపిస్తోంది.
ఎన్నికలు దగ్గరయ్యేసరికి ఏపీ భాజపా నుంచి ఇతర పార్టీలకు వలసలు ఉండే వాతావరణం కనిపిస్తోంది. భాజపా నేత ఆకుల సత్యనారాయణ వ్యవహారం తెలిసిందే. మరోనేత విష్ణుకుమార్ రాజు టీడీపీ వైపు చూస్తున్నట్టు ప్రచారం ఉంది. ఇక, మిగిలిన నేతల్లో కొందరు సైలెంట్ గా ఉంటున్నవారూ ఉన్నారు! దేశంలో అధికారంలో ఉన్న పార్టీ, స్వతంత్రం వచ్చాక ఏ రాష్ట్రానికీ చేయనంత సాయం ఆంధ్రాకి చేసిన పార్టీ, ఇవాళ్ల రాష్ట్రంలో ఎలా ఉండాలి..? కానీ, వాస్తవ పరిస్థితి అలా లేదు. పోనీ, ఉన్న నాయకుల్ని ఏకతాటిపై నడిపించడంలో నాయకత్వం కూడా విఫలమౌతోందన్న విమర్శలూ మొదలయ్యాయి. దీనికి కారణం లేకపోనూ లేదు!
కాంగ్రెస్ నుంచి తీసుకొచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ బాధ్యతలు అప్పగించడంపై ఏపీ భాజపాలో ఒక వర్గానికి మొదట్నుంచీ ఇష్టం లేదు. ఆయన్ని ఎంపిక చేసిన సమయంలో సోము వీర్రాజు కొన్నిరోజులపాటు ముఖం చాటేసిన పరిస్థితి..! ఆ తరువాత, జాతీయ నాయకత్వం జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో కన్నా నాయకత్వంలో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పట్నుంచీ పార్టీలో నేతలంతా ఐక్యంగా ఉన్నట్టు పైపైకి కనిపిస్తున్నా… కన్నా నాయకత్వంలో పనిచేయాల్సిన పరిస్థితిపై కొంత అసంతృప్తితో ఉన్నట్టుగానే గుసగుసలు ఉన్నాయి. ఆ కారణంతోనే… ఇప్పుడు కొంతమంది పార్టీ నుంచి బయటకి వెళ్లేట్టు కథనాలు వస్తున్నా, వారితో నేరుగా జాతీయ నాయకత్వం మాట్లాడాల్సిన పరిస్థితి ఉందే తప్ప, కన్నా జోక్యం చేసుకుని నచ్చజెప్పే వాతావరణం ఏపీ భాజపాలో లేదనే అభిప్రాయమూ వినిపిస్తోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ సమయంలో పార్టీ నుంచి నేతలు వలసలు వెళ్లే వాతావరణాన్ని కన్నా వైఫల్యంగానూ కొంతమంది అభిప్రాయపడుతున్న పరిస్థితి.