తెలంగాణలో కేసీఆర్ సర్కారుపై ప్రతిపక్షాలు పెద్దగా చేస్తున్న విమర్శల్లో ఒకటి… ఈ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత లేదని! నిన్న, రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఇదే విమర్శ చేశారు కదా! కేంద్రంలోనూ, తెలంగాణలోనూ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనీ, ఢిల్లీలోనూ హైదరాబాద్ లోనూ ఒకే తీరుగా ఉందని ఆయన విమర్శించారు. ఇక, రాష్ట్ర కాంగ్రెస్ నేతలైతే.. కేసీఆర్ క్యాబినెట్ లో మహిళలకు ప్రాధాన్యత దక్కలేదనీ, పార్టీపరంగా తెరాస మహిళలకు గుర్తింపు ఎక్కడుందంటూ ఎప్పటికప్పుడు వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ఈ విమర్శని సమర్థంగా తిప్పికొట్టే అవకాశం ఇన్నాళ్లూ సీఎం కేసీఆర్ కు రాలేదనే చెప్పాలి. కానీ, ఇవాళ్ల ఓ కార్యక్రమంలో అలాంటి సందర్భం వచ్చింది.
సిద్ధిపేట జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. దేశంలోనే ఇలాంటి పథకం ఎక్కడా లేదనీ, ఈ సదుపాయాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సీఎం అన్నారు. ఈ సందర్భంగా మహిళల గురించి మాట్లాడుతూ… ‘జిల్లా ఎస్పీగారు… అమ్మాయి, ఐపీఎస్ ఆఫీసర్. నా వెంట వచ్చిన హెల్త్ సెక్రటరీ శాంతి కుమారి.. ఐఎఎస్ ఆఫీసర్. వాకాటి కరుణ, మీ జెడ్పీటీసీ… జెడ్పీ ఛైర్మన్ గారు ఒక మహిళనే. అంతెందుకు, మన అసెంబ్లీకే డెప్యూటీ స్పీకర్.. పద్మా దేవేందర్ రెడ్డి మహిళనే’ అంటూ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. వీళ్లు మొగోళ్లు కంటే ఏం తక్కువ పనిచేస్తున్నారండీ అన్నారు. ఇది ఆడవాళ్లు చేసే పనీ, ఇది మగాళ్లు చేసే పని అని తేడాగా చూసే జాడ్యం మనదేశంలో మాత్రమే ఉందని విమర్శించారు. ‘ఆడవాళ్లలో మంచి బుద్ధిమంతులు, తెలివి గలోళ్లు లేరా, ప్రతిభ ఉన్నోళ్లు లేరా.? మన మగాళ్లలో కొంతమంది సన్నాసులు లేరా? వంట ఆడవాళ్లే చెయ్యాలి, మగాళ్లు చెయ్యకూడదా.. ఏం సిగ్గనిపిస్తోందా’ అంటూ చమత్కరించారు.
తెలంగాణ ప్రభుత్వంలో మహిళలు కీలక పదవుల్లో ఉన్నారనీ, రాజకీయంగా వారికీ ప్రాధాన్యత ఉంటోందన్న అంశాన్ని పరోక్షంగా కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తోంది. అయితే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే… ఇతర పార్టీల విమర్శ ఏంటీ, మంత్రి వర్గంలోగానీ ఎమ్మెల్యేల్లో ఎక్కువ సంఖ్యలో మహిళలు ఎందుకు లేరని కదా! కానీ, ఉన్నతాధికారుల్లోనూ… జిల్లాస్థాయి నేతల్లోనూ మహిళలకు కల్పిస్తున్న ప్రాధాన్యతను వెతుక్కుని మాట్లాడుకోవాల్సిన పరిస్థితిలో తెరాస ఉంది..! కేసీఆర్ ప్రయత్నం అయితే అదేగానీ.. ఇది ప్రతిపక్షాల విమర్శలకు ధీటైన సమాధానంగా సరిపోవడం లేదు కదా?