త్వరలోనే పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో ప్రధాని మోడీతోపాటు అధికార పార్టీ కీలక నేతల్లో ఒకింత టెన్షన్ ఉందన్నది వాస్తవం. ఎందుకంటే, గత సమావేశాలు సజావుగా సాగలేదు. సభను సజావుగా నిర్వహించడంలో అధికార పార్టీ ఫెయిల్ అయిందన్న అభిప్రాయమే వ్యక్తమైంది. లోక్ సభలో పరిపూర్ణ మెజారిటీ ఉండి కూడా, టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని మోడీ సర్కారు ఎదుర్కొనలేకపోయింది. ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సభకు గైర్హాజరయ్యారు. రాబోయే సమావేశాల్లో కూడా ఇలాంట పరిస్థితులు ఉండే అవకాశమే ఎక్కువ. ఈ అంచనా భాజపాకి ముందుగా ఉంది కాబట్టే… ఇతర పార్టీలను వేరే అంశాలపై ఫోకస్ చేసే విధంగా మోడీ మార్కు డైవర్షన్ ప్లాన్ అమలు చేస్తున్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది..!
ఇంతకీ ఆ డైవర్షన్ ప్లాన్ ఏంటంటే… జమిలి ఎన్నికలపై చర్చ! కేంద్ర, రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనపై లా కమిషన్ అభిప్రాయ సేకరణ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, అది సాధ్యమయ్యే పని కాదన్నది మొదట్నుంచీ ఓ స్థాయి అంచనాకు అందుతున్న అంశమే. దేశంలోని అన్ని పార్టీల అభిప్రాయాలూ కావాలంటూ ఓ పక్క ప్రస్తుతం హడావుడి జరుగుతోంది. అయితే, జమిలిపై భాజపా, కాంగ్రెస్ పార్టీల మనోగతాలు ఏంటనేది మాత్రం ఆ రెండు పార్టీలు ఇంకా చెప్పకపోవడం గమనార్హం. ఇక, లా కమిషన్ ముందుకు వచ్చిన పార్టీలల్లో చాలావరకూ జమిలికి నో అనే చెప్పాయి. మెజారిటీ అభిప్రాయం వద్దనే వినిపిస్తోంది. కాబట్టి, జమిలికి దాదాపు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సరే, ఒకవేళ అన్ని పార్టీలనూ ఒప్పించేందుకు భాజపా ప్రయత్నించినా.. జమిలి ఎన్నికల నిర్వహణకు రాజ్యంగపరంగా కొన్ని ఇబ్బందులున్నాయని నిపుణులు అంటున్నారు. రాజ్యాంగ సవరణ అవసరమైతే… ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యమా అనే ప్రశ్న కూడా ఉంది.
ఏ రకంగా చూసుకున్నా జమిలి ఎన్నికలు అసాధ్యమనే వాదనే ఎక్కువగా వినిపిస్తోంది. అలాంటప్పుడు, కేంద్రం ఇదే అంశాన్ని పట్టుకుని ఎందుకు సాగదీత ధోరణితో వ్యవహరిస్తోందంటే… పార్లమెంటు సమావేశాలే అనే అభిప్రాయమూ వినిపిస్తోంది! దేశంలోని ప్రతిపక్షాలూ, ఇతర పార్టీలను ఎన్నికల పేరుతో బిజీబిజీగా ఉంచడం వల్ల… రాబోయే పార్లమెంటు సమావేశాలను వీలైనంత త్వరగా, ఇతర చర్చలకు ఆస్కారం ఇవ్వకుండా, ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలకు ఛాన్స్ ఇవ్వకుండా చేయాలన్నదే మోడీ వ్యూహం అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. రాబోయే సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ విజయాలు, వైఫల్యాలు అనే అంశాలను చర్చకు రానీయకుండా ఉండాలంటే… ఆ దిశగా చర్చలకు కసరత్తు చేసే సమయం ఇతర పార్టీలకు ఇవ్వకూడదన్నదే ప్రస్తుతం ఈ జమిలి ఎన్నికల నిర్వహణపై పెద్ద చర్చ జరిగేలా చేస్తున్న కారణమనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. మరి, ఈ రకమైన ట్రాప్ లో ప్రతిపక్షాలు పడ్డాయా లేదా అనేది పార్లమెంటు సమావేశాలు మొదలైతేగానీ తెలీదు.