” ఊహించని విధంగా ముందస్తు ఎన్నికలు వచ్చాయి. సరైన సన్నద్ధత లేని కారణంగా… ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నాం..” … ఇది తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేకపోవడానికి కారణం చెబుతూ… పవన్ కల్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్. నిజానికి.. పవన్ కల్యాణ్ .. ఐదేళ్ల నుంచి రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ముందస్తు రావడం ఖాయమన్న అంచనాతో… తెలంగామలోని అన్ని రాజకీయ పార్టీలు సన్నహాలు చేసుకున్నాయి. చేసుకున్నా.. చేసుకోకపోయినా.. ఎన్నికలొస్తే..పోటీ చేయడం.. పార్టీల లక్షణం. అప్పటికీ కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత పది వారాలకుపైగా సమయం ఉంది. కానీ.. సన్నద్దత లేని కారణంగా.. పవన్ ఎన్నికల బరి నుంచి వైదొలిగారు. మరి ఇప్పుడు ఆ సన్నద్ధత ఏపీ ఎన్నికల్లో ఉందా..? పవన్.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారా..? తూ..తూ మంత్రం కసరత్తులతో ఎన్నికల గోదాను ఈదగలరా..?
పది వారాల్లో ఎన్నికలు..! ఏదీ ప్రణాళిక..!?
ఫిబ్రవరి అంటే.. ఈ నెలాఖరులో లేదా.. ఆ తర్వాత రెండు, మూడు రోజుల్లో ఎన్నికల ప్రకటన వెలువడటం ఖాయం. గత ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. చూస్తే.. ఆంధ్ర, తెలంగాణల్లో ఎన్నికలు.. ఏప్రిల్‌లో చివరి వారంలో ఉండవచ్చు. అంటే… ఇప్పటి నుంచి లెక్క వేస్తే..కచ్చితంగా ఉన్నది పది అంటే.. పది వారాలు మాత్రమే. ఎన్నికల ప్రకటనకు.. పట్టుమని ఇంకా ఇరవై రోజుల సమయం కూడా లేదు. అయినప్పటికీ పవన్ కల్యాణ్.. ఇప్పటికీ పార్లమెంటరీ కమిటీలతో.. కాలక్షేపం చేస్తున్నారు. ఈ పార్లమెంటరీ కమిటీలు.. మూడు నాలుగేళ్ల ముందుగా వేసుకుంటే.. పార్టీని ఆ కమిటీలు ప్రజల్లోకి తీసుకెళ్లేవి. కానీ.. ఎన్నికలకు పది వారాల ముందు.. ఈ కమిటీల నియామకంతో కలిగే ప్రయోజనం ఏమిటి..? ఇప్పటికీ.. పార్లమెంటరీ కమిటీల కసరత్తులతోనే జనసేన వ్యవహారాలు నడుస్తున్నాయి. అభ్యర్థుల స్క్రీనింగ్ కోసం ఇప్పుడు ఓ కమిటీని నియమించినట్లు ప్రకటన చేశారు. ఆ కమిటీ.. ఇప్పటి నుంచి పని మొదలు పెడితే.. 175 నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థులు… 25నియోజకవర్గాల్లో పార్లమెంట్ అభ్యర్థుల్ని… ఎంపిక చేయడం సాధ్యమయ్యే పనేనా..?
ఇతర పార్టీల సన్నద్ధతను చూసైనా స్పీడ్ పెంచుకోరా..?
కింగ్ మేకర్లం అవుతాం.. గేమ్ చేంజర్లం అవుతామనే ప్రకటనలే కానీ.. ఆ మాత్రం అవడానికి తాము చాలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్న విషయాన్ని మర్చిపోతున్నారు. పటిష్టమైన.. గ్రామస్థాయి పార్టీ నిర్మాణం, క్యాడర్ ఉన్న పార్టీలు అయిన టీడీపీ, వైసీపీ.. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కసరత్తును దాదాపుగా పూర్తి చేశాయి. ఎక్కడెక్కడ ఎవరు..అన్నదానిపై మెజార్టీ నియోజకవర్గాల్లో తమ తమ క్యాడర్‌కు అంతర్గత సందేశం పంపించాయి. గట్టి పోటీ ఉన్న చోట్ల మాత్రమే నాన్చుతున్నారు. కానీ.. జనసేనలో ఆ ప్రక్రియ అంటూ ఇప్పటి వరకూ జరగలేదు. ఇప్పుడే ఓ కమిటీని ఏర్పాటు చేసి.. దరఖాస్తులు చేసుకోవాలని.. సూచించారు. ఇవేమీ సినిమా టిక్కెట్లు కాదుగా.. ముందు వచ్చిన వారికి.. ముందు బేసిస్‌గా పంపిణీ చయడానికి. కనీసం పార్టీ పరువు నిలిపే అభ్యర్థులైనా కావాలి కదా..!. పార్టీలన్నీ.. ఇప్పటికే రాజకీయ పరంగా… ఒక్క టిక్కెట్ల విషయంలోనే.. రాజకీయ వ్యూహాల పరంగా.. పరుగులు పెడుతున్నాయి.
ఈ ఏడాదిలో జనసేన కార్యాచరణ తాబేలుతో పోటీ పడిందా..?
ఎన్నికల ఏడాది ఇది. హఠాత్తుగా వచ్చింది కాదు. సన్నద్ధత లేదని చెప్పుకోవడానికి లేదు. ఆ విషయం… టీడీపీ, వైసీపీకి తెలుసు కాబట్టే… దాదాపుగా.. ఎన్నికల రణంలోకి దిగడానికి ఏర్పాట్లు చేసేసుకున్నాయి. చంద్రబాబు అటు అధికారవ్యవహారాల్ని.. ఇటు పార్టీ వ్యవహారాల్ని… కూడగట్టుకుని పరుగులు పెడుతున్నారు. ఎన్నికల ముందు.. ప్రజల్ని సంక్షేమ కార్యక్రమాల పేరుతో.. పథకాల్లో ముంచుతున్నారు. ఇప్పటి నుంచి ప్రతీ నెలా… ప్రతి ఒక్క ఇంటికి డబ్బులు చేరేలా ఏర్పాట్లు చేసుకున్నారు. మరో వైపు.. కేంద్రంపై పోరాటంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దేశంలో బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు… అమరావతి టు ఢిల్లీ… అమరావతి టు కోల్ కతా…. ఇలా ఎక్కడికి అవసరం అయితే.. అక్కడకు పోతున్నారు. దీక్షలు చేస్తున్నారు. ప్రతీ రోజూ.. ఏదో ఓ ఈవెంట్ పెట్టుకుని.. అంతా తానై వ్యవహరిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పాదయాత్ర ముగిసిన తర్వాత కాస్త రిలాక్స్ అయినట్లు కనిపిస్తున్నపటికీ.. శంఖారావం సభలతో ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. కానీ.. పవన్ కల్యాణ్… ఈ ఏడాది నుంచి ఇప్పటి వరకు.. ఒక్క సారంటే.. ఒక్క సారి కూడా ప్రజల్లోకి రాలేదు. ఎన్నికలు ముంచుకొస్తున్నాయి కాబట్టి.. పోరాటయాత్రలు నిలిపివేశామని ప్రకటన చేశారు. కానీ.. ఈ నలభై రోజుల్లో జనసేన పరంగా.. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలేమైనా జరిగాయా.?. పార్టీ నిర్మాణం పేరుతో సమయం గడిపేస్తే..ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారు..!
వలస నేతలకు బీఫాంలు ఇచ్చేద్దామనే ఆలోచన చేస్తున్నారా..?
కమ్యూనిస్టులతో పొత్తులన్నారు కానీ.. వారితో కలిసి నడిచే విషయంలో.. వారికే క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఏ స్థానాలు.. ఎన్ని స్థానాలు అన్నదానిపై చర్చల్లేవు. వైసీపీ, టీడీపీ…పొత్తుల్లేకుండా.. అన్ని స్థానాల్లో పోటీ చేయాలనకున్నాయి కాబట్టి.. ఆ దిశగా.. వారికి బాదరబందీ లేదు. కానీ.. జనసేనాధినేత మాత్రం పొత్తులన్నారు కాబట్టి.. ఓట్ల బదిలీ జరగాలంటే.. పొత్తులు తేల్చుకోవాలి. జనసేన పరిస్థితి చూస్తూంటే.. వైసీపీ, టీడీపీల్లో టిక్కెట్లు దొరకని వాళ్లు వస్తారు.. వారికే.. బీఫాంలు ఇస్తే.. సరిపోతుందన్నట్లుగా.. ఉందన్న సెటైర్లు పడుతున్నాయి. జనసేన సన్నద్ధత ఇలాగే ఉంటే… పవన్ కల్యాణ్‌కు కూడా ఇంత కంటే.. వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు. అలా కాకుండా ఉండాలంటే.. సరైన సన్నద్ధత లేని కారణంగా… అన్ని స్థానాల్లో పోటీ చేయలేకపోతున్నామనే.. ప్రకటన చేసుకోవాల్సి ఉంటుంది.