తెలంగాణ ప్రభుత్వంలోని కీలక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల త్వరలో తెలంగాణలో ఆస్తుల విలువలు పెంచుతామని అలాగే రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా పెంచుతామని ప్రకటించారు. పొంగులేటి ప్రకటనపై రియల్ ఎస్టేట్ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆస్తుల విలువల పెంపు అనే అంశంపై భిన్నాభిప్పాయాలు వ్యక్తమవుతున్నా.. రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు అనేది మాత్రం కరెక్ట్ కాదన్న అభిప్రాయం ఏకగ్రీవంగా వినిపిస్తోంది.
కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లే ముందు ఆస్తుల విలువల్ని పెంచింది. రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా పెంచింది. సాధారణంగా ప్రభుత్వాలు ఆదాయం కోసం భూముల విలువల్ని పెంచుతూ ఉంటాయి. అయితే ఇలా పెంచడం వల్ల కొంత మంది రియల్టర్లకు మేలు జరుగుతుంది. రైతులకూ మేలు జరుగుతుంది. నిజానికి కొనుగోలుదారులకూ మేలే. ఎందుకంటే ఇప్పుడు స్థలం మార్కెట్ ధర ప్రకారమే అధికారికంగా చెల్లించి మిగతా మొత్తం బ్లాక్ లో ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితి మారవచ్చు. అయితే ప్రభుత్వ స్థలాల విలువల్ని పెంచితే.. రియల్టర్లు మార్కెట్ విలువ కూడా పెంచే అవకాశం ఉంది. అలా జరగడానికి డిమండ్ ఉండాలి. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు.
ఇక రియల్ ఎస్టేట్ రంగం రిజిస్ట్రేషన్ల విలువ పెంపుదల అనే మాటతో ఉలిక్కి పడుతుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నది అభిప్రాయం ఉంది. ఆస్తి కొనుగోలు చేయడానికి ఎంత ఖర్చు పెట్టాలో.. రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అందులో పావు వంతు.. అధికారికంగా.. అనధికారికంగా ఖర్చు పెట్టాల్సి రావడం మాత్రం కొనుగోలుదారుల సెంటిమెంట్ బలహీనపరుస్తుంది. ఇది రియల్ మార్కెట్ ను దెబ్బతీసే అవకాశం ఉంది.
ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో రియల్ మార్కెట్ డల్ గా ఉంది. ఇప్పుడిప్పుడే పుంజుకుటంున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ప్రకటించినట్లుగా నిర్ణయాలు అమల్లోకి తెస్తే పెద్ద సమస్య అవుతుందని అంచనా వేస్తున్నారు. మరి ప్రభుత్వం వారి గోడు వింటుందా ?