మాజీ సీఎం అసెంబ్లీకి రావటం యాధృచ్ఛికంగానేనా… దీని వెనుక కూడా కేసీఆర్ వ్యూహాం ఉందా… అన్న ప్రశ్నలకు బీఆర్ఎస్ సీనియర్ల నుండి కీలకమైన సమాధానం వస్తోంది. ఇన్నాళ్లు సైలెంట్ ఉన్న కేసీఆర్, కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనని కేసీఆర్… సడన్ గా అసెంబ్లీకి రావటమే కాదు, తను ఎత్తేయాలనుకున్న ఓ మూలన ఉన్న మీడియా పాయింట్ కు సాధారణ సభ్యుడిలా వచ్చి మాట్లాడటంలో కూడా పెద్ద వ్యూహామే ఉందని చర్చ జరుగుతోంది.
ఇక నుండి రెగ్యూలర్ గా అసెంబ్లీకి వస్తాను… ప్రభుత్వాన్ని ఎండగడుదాం… చీల్చి చెండాడుదాం… అంటూ బడ్జెట్ తర్వాత ఎమ్మెల్యేలతో కేసీఆర్ వ్యాఖ్యానించారు.
దీని అంతటి కారణం ఎమ్మెల్యేల ఫిరాయింపులే అని తెలుస్తోంది. కేసీఆర్ సైలెంట్ గా ఇంట్లో ఉంటే ఎమ్మెల్యేలంతా అయోమయంలో ఉండిపోయారు. కేటీఆర్, హరీష్ రావులు ఎంత టచ్ లో ఉన్నా… ఎమ్మెల్యేల మనోధైర్యం పెంచేలా చేయలేకపోయారు. దీంతో ఒక్కొక్కరుగా పార్టీ మారుతున్నారు. కేసీఆర్ ఎలాగు రారు… పార్టీ భవిష్యత్ కష్టమన్న ఫీలింగ్ కు చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారని ప్రచారం జరిగింది. తలసాని, గంగుల కమలాకర్ వంటి నేతలు పార్టీతోనే ఉన్నా పెద్దగా యాక్టివ్ గా లేరు. వచ్చామా వెళ్లిపోయామా అన్నట్లుగా ఉన్నారు.
ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కోర్టు మెట్లు ఎక్కినా ఫలితం అంతంత మాత్రంగానే ఉండటంతో… ప్రభుత్వాన్ని వణికించామన్న పేరు వస్తే ఎమ్మెల్యేలు చేజారకుండా ఉంటారు, అది జరగాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావటమే ముఖ్యమన్న అభిప్రాయానికి వచ్చాకే కేసీఆర్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతే కాదు బడ్జెట్ పై చర్చకు ఎక్కువ అవకాశం ఉంటుంది. పైగా ప్రతిపక్ష నేత కూడా కాబట్టి… ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా చేస్తే, రేవంత్ అండ్ కో ఎదురుదాడి చేస్తుంది. ఇందులో పైచేయి సాధిస్తే… పార్టీలోనూ, బయట కూడా గట్టి ప్రతిపక్షంగా నిలబడటం ద్వారా ఎమ్మెల్యేలు, క్యాడర్ లో ఆత్మస్థైర్యం కల్పించొచ్చు అన్న వ్యూహాంతోనే అసెంబ్లీకి వస్తున్నట్లు సమాచారం.