ఏ గుమ్మం ముందు ఆ పాట పాడాలనీ వెనకటికో సామెత ఉంది. తెలుగుదేశం పార్టీ పరిస్థితి అచ్చం అలానే ఉంది. ఆంధ్రాలో ఒకలా, తెలంగాణలో మరోలా ఉండాల్సిన పరిస్థితి! రాష్ట్రాలు వేరైనప్పుడు ఎక్కడి వ్యూహం అక్కడ ఉండటంలో తప్పులేదు. కానీ, వాటిలోని డొల్లతనం ప్రజలకు అర్థమయ్యేట్టుగా ఉండకూడదు కదా! తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యాల్లో కనిపిస్తున్నది అచ్చమైన ఆ డొల్లతనమే! విశాఖపట్నంలో జరిగిన మహానాడు కార్యక్రమానికి రేవంత్ కూడా వెళ్లారు. తిరిగి హైదరాబాద్ కి రాగానే యథావిధిగా కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దగ్గర నుంచీ ఆంధ్రా కాంట్రాక్టర్లకే కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. ఆంధ్రా ప్రాంత నేతలకీ, కళాకారులకు తెలంగాణలో విశేష ప్రాధాన్యత ఇస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినవారే ఇప్పుడు గద్దెనెక్కి పాలిస్తున్నారన్నారు. అమర వీరుల కుటుంబాల దగ్గరకి తాను వెళ్తాననీ, సమగ్ర సర్వే ద్వారా వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. తమకు ఏమాత్రం అవకాశం వచ్చినా అమర వీరుల స్మారక స్థూపాన్ని అధికారిక చిహ్నంగా మారుస్తామని ఈ సందర్భంగా ఓ హామీ కూడా ఇచ్చేశారు.
మహానాడుకు వెళ్లిన రేవంత్ కి చంద్రబాబు ఇవే మాటలు చెప్పి పంపించారా..? తెలంగాణకు వెళ్లగానే ఆంధ్రా కాంట్రాక్టర్లపై, నేతలపై, కళాకారులపై విమర్శలు చేయమని చెప్పారా..? లేదంటే, ఇలా విమర్శిస్తా అని చంద్రబాబు దగ్గర రేవంత్ పర్మిషన్ తీసుకుని వచ్చారా అనేట్టుగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో పార్టీని పునరుద్ధించాలన్నది చంద్రబాబు పట్టుదల. అయితే, ఇక్కడ సెంటిమెంట్ ప్రయోగించాలంటే… మళ్లీ ఆంధ్రా వ్యతిరేక భావజాలాన్ని రేకెత్తించాలి. అలాంటిదేదో ప్రజల్లో రేకెత్తిస్తే తప్ప.. తెలుగుదేశం పార్టీని వారు ఓన్ చేసుకునేందుకు కావాల్సిన బలమైన కారణాలేవీ లేవు. ఇంకోటీ.. తెలంగాణలో మరో ఎమోషనల్ అంశం అమర వీరులు. అందుకే, వారికి కూడా రేవంత్ ఓ హామీ ఇచ్చారు. తమకు అవకాశం వస్తే స్థూపాన్ని రాష్ట్ర చిహ్నంగా చేసేస్తాం అంటున్నారు!
తెలంగాణలో సెంటిమెంట్ ను వాడుకునేందుకు టీడీపీ సిద్ధమౌతోందన్నది రేవంత్ వ్యాఖ్యాల్ని బట్టీ అర్థం చేసుకోవచ్చు. అయితే, విశాఖ వెళ్లి వచ్చిన వెంటనే రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనకున్న రాజకీయ ప్రయోజనాలు స్పష్టంగా అర్థమౌతూనే ఉన్నాయి. ఆంధ్రాకి వెళ్లొచ్చాక, కొద్ది రోజులు ఆగిన తరువాత ఇలాంటి టాపిక్ ఎత్తుకుంటే కొంతలో కొంత బాగుండేది. కానీ, వెళ్లొచ్చిన వెంటనే ఇలా మాట్లాడుతుంటే… ప్రజలు ఏమనుకుంటారు..?