బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ కు ఎందుకు షాక్ ఇస్తున్నారు..? అసలు వారు పార్టీ ఎందుకు మారుతున్నారు? కేవలం ఆర్థిక కారణాలేనా..? మరేమైనా ఉన్నాయా? ఇప్పుడిదే ఈ అంశంపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి ఆర్థికపరమైన అంశాలు ఒక కారణం అయినప్పటికీ.. మరో ముఖ్యమైన కారణం కూడా ఉందని అంటున్నారు. అదే కేసీఆర్,కేటీఆర్ ల ఆధిపత్య ధోరణి అని చెప్పుకుంటున్నారు.
ఆ పార్టీలో ఫ్రీడం అసలు ఉండదని.. ఎమ్మెల్యేలను పురుగులా ట్రీట్ చేస్తారని ఇటీవల కడియం శ్రీహరి, దానం నాగేందర్ లాంటివాళ్ళు వ్యాఖ్యానించడం అందుకు బలాన్నిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆటిట్యూడ్ ను నేతలు అంగీకరిస్తారోమో కానీ, పవర్ పోయాక కూడా అదే అహంభావం చూపిస్తే నేతలు ఎందుకు ఊరుకుంటారు..? ఇప్పుడు ఎమ్మెల్యేలు కసి తీర్చుకుంటున్నారు. కేటీఆర్ ఆటిట్యూడ్ కు రివర్స్ లో సమాధానం చెప్తున్నారు. పార్టీ మారొద్దని కేటీఆర్ తో సహా, కేసీఆర్ కోరినా పట్టించుకోవడం లేదు.
గతంలో కేటీఆర్ ప్రదర్శించిన ఆటిట్యూడ్ ను ఎమ్మెల్యేలు ఆయనకు రుచి చూపిస్తున్నారు. చెప్పిన వినకపోవడం, ఏదైనా చెప్తే తలాడించడం చేస్తూ తాము చేయాల్సిన పనులను చేస్తూ బీఆర్ఎస్ ను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నారు. దీంతో ఉన్న ఎమ్మెల్యేలు అయినా పార్టీ చేజారకుండా ఉండాలంటే కేటీఆర్, కేసీఆర్ తన అహంభావం తగ్గించుకోవాలని అంటున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ లో లభించని భావ ప్రకటన స్వేఛ్చ కాంగ్రెస్ లో ఉంటుందని పనిలో పనిగా అధికార పార్టీలలో చేరితే ప్రజలకు పనులు చేసి పెట్టొచ్చునని మరికొంతమంది ఎమ్మెల్యేలు ఆలోచన చేస్తున్నారు.
పవర్ పాలిటిక్స్ లో లేకపోతే తమ వ్యాపారాలపై ప్రభావం పడుతుందని అందుకే కాంగ్రెస్ గూటికి చేరుతున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు ప్రతికూల ఫలితాలు రావడం..క్యాడర్ ఒత్తిళ్ళు , నియోజకవర్గ అభివృద్ధి, ఆర్థిక వ్యవహారాలు వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంప్ చేస్తున్నారని అంటున్నారు.