హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేస్తోన్న రాజకీయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ అగ్రనేతలను మించి కాంగ్రెస్ సర్కార్ తో ఢీ అంటే ఢీ అంటున్న కౌశిక్ రెడ్డి వ్యూహాత్మక రాజకీయం చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పిలుపు కోసమే దూకుడుగా రాజకీయం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం బీఆర్ఎస్ ఎల్పీపై కాంగ్రెస్ ఫోకస్ చేస్తుండటమే కౌశిక్ రెడ్డి దూకుడు రాజకీయానికి కారణమన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఆయా జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలను మంత్రులకు అప్పగించడంతోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రి పొన్నంపై గతంలో చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేతల సవాల్ మేరకు తాజాగా హనుమాన్ టెంపుల్ లో కౌశిక్ రెడ్డి ప్రమాణం పేరిట హడావిడి చేశారని… ఇది కాంగ్రెస్ లో చేరిక కోసమేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అగ్రెసివ్ గా వాయిస్ వినిపిస్తోన్న నేతలనే మొదట కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని… అందుకే కౌశిక్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై దూకుడుగా విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. ఉత్తమ్ సమీప బంధువు అయిన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం పెద్ద కష్టమేమి కాదు. కానీ, ఆయన కాంగ్రెస్ ను వీడిన సమయంలో రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రేవంత్ పిలుపు కోసమే కౌశిక్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ గా అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తున్నారన్న విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి.