జనసేన అధినేత పవన్ కల్యాణ్ హఠాత్తుగా తీవ్ర ఆవేశానికి గురౌతున్నారు! నిన్న అర్ధరాత్రి నుంచి వరుస ట్వీట్లు మొదలుపెట్టారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారం వెనక టీడీపీ ఉందనీ, ఆ పార్టీకి వంతపాడే ఒక మీడియా వర్గం పనిగట్టుకుని మరీ బురదచల్లే కార్యక్రమాలు చేస్తోందంటూ విమర్శించారు. అంతేకాదు, కుటుంబ సభ్యులతో సహా ఫిల్మ్ ఛాంబర్ కి వచ్చి దీక్షకు దిగారు. ఇంతకీ ఉన్నట్టుంది పవన్ కు ఇంత ఆవేశం ఎందుకొచ్చింది..? ఆర్జీవీ విమర్శలు చేసిన వెంటనే స్పందించకుండా… కాస్త గ్యాప్ తీసుకున్నాకనే ఎందుకు స్పందించారు..? మీడియాపై పవన్ అనూహ్య వార్ వెనక వేరే ప్రోత్సాహంగానీ, ప్రోద్బలంగానీ ఉందా..? అంటే అవుననే గుసగుసలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
పవన్ కల్యాణ్ స్పందనను ఒక రాజకీయ అంశంగా కాకుండా, మీడియా సంస్థల మధ్య వార్ గా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. పవన్ కు అత్యంత సన్నిహితుడైన ఒక ప్రముఖ మీడియా సంస్థ అధినేతతో నిన్న భేటీ అయినట్టు సమాచారం! దాదాపు మూడు గంటలపాటు ఆ అధినేతతో పవన్ మాట్లాడారట! ఉద్దేశపూర్వకంగా పవన్ ను ఈ వివాదంలోకి లాగారనీ, తద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందడం కోసం జరుగుతున్న కుట్ర ఇది అంటూ సదరు మీడియా సంస్థ అధిపతి పవన్ కు చెప్పారనే పుకారు వినిపిస్తోంది. దీంతో పవన్ కు ఆగ్రహం వచ్చిందనీ… అందుకే అర్ధరాత్రి నుంచి వరుస ట్వీట్లు మొదలుపెట్టారనీ, టీడీపీ కుట్రలో కొన్ని మీడియా సంస్థల మిలాకత్ అంటూ ఆరోపణలు కురిపించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ ఇష్యూ ద్వారా తమకు పోటీ మీడియా సంస్థలను దెబ్బ తీయాలనేది ఆ ‘అధిపతి’ ఉద్దేశం అయి ఉంటుందనే పుకార్లూ వినిపిస్తున్నాయి.
సహజంగానే ఎవరైనా ఏదైనా చెబితే దానిపై పవన్ వెంటనే స్పందించేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ అవినీతికి పాల్పడ్డారని చేసిన ఆరోపణలు కూడా అలాంటివే కదా! అందరూ అంటున్నారనీ, ఆ సమాచారం తన ద్రుష్టికి వచ్చిందని ఆరోపించినట్టు పవన్ చెప్పారు కదా! సో.. ప్రస్తుతం పవన్ చేసిన విమర్శల వెనకా ఒక మీడియా అధిపతి ప్రోత్సాహం ఉందంటూ వినిపిస్తున్న గుసగుసల్లో నిజం ఎంతుందో ఇంకా నిగ్గు తేలాల్సి ఉంది.