రమణ దీక్షితులు ఉన్నట్లుండి మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఆయన నేరుగా లోటస్ పాండ్ కు వెళ్లి వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ ను కలవడం చర్చనీయాంశమైంది. జగన్ కలవడం వల్ల అనేక విమర్శలు వస్తాయని తెలిసి కూడా రమణ దీక్షితులు జగన్ ను కలిసింది ఎందుకు? రమణ దీక్షితులు సమస్య జగన్ కు తెలియంది కాదు. జస్ట్ ఫోన్ చేసి, చిన్నగా విన్నవించుకుంటే చాలు. ఎవరికీ తెలియకుండా, హడావుడి లేకుండా వుంటుంది. ఇది తెలిసి కూడా రమణ దీక్షితులు ఎందుకు వెళ్లినట్లు?
రమణ దీక్షితులు జగన్ ను కలసి, నలభై నిమషాలు ఏకాంతంగా మాట్లాడడం వెనుక వేరే విషయం వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రమణ దీక్షితులు మీద టీటీడీ న్యాయపోరాటానికి సిద్దం అవుతోంది. అదే సమయంలో రమణ దీక్షితులు సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేయబోతున్నారు.
ఇందుకు ఢిల్లీలో బడా బడా న్యాయవాదుల సాయం రమణ దీక్షితులుకు అవసరం పడిందని తెలుస్తోంది. పెద్ద న్యాయవాదుల సాయం తీసుకోవడం అంటే అంత చిన్న విషయం కాదు. ఫీజు లక్షల్లో వుంటుంది. కేసు టేకప్ చేస్తే కోట్లే. ఈ స్థాయి వ్యవహారం రమణదీక్షితులకు సాధ్యం కాదు. అందుకే ఆయన జగన్ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
తనకు ఆ ఒక్క సపోర్టు అందించమని రమణ దీక్షితులు జగన్ ను కోరారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. జగన్ కు, ఆయన సంస్థలకు ఎంతో మంది బడా లాయర్లతో అనుబంధాలు వున్నాయి. ఆయన కేసులు చూస్తున్న అనేకమంది లాయర్లు వున్నారు. అందువల్ల ఆ విధమైన సాయం కనుక చేస్తే చాలని రమణ దీక్షితులు కోరినట్లు వినిపిస్తోంది. కాగల కార్యం జగన్ తీరిస్తే, పోరాటం రమణ దీక్షితులు చేస్తారన్నమాట.