ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అంతా ఓ అంచనాకు వచ్చేశారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం పక్కా అని తేల్చేస్తున్నారు. వైసీపీ నేతల వ్యవహారశైలి కూడా భిన్నంగా కనిపిస్తోంది. తీవ్ర ప్రజా వ్యతిరేకత బహిరంగంగా కనిపిస్తున్నా జగన్ గతంలో కన్నా ఒక సీటు ఎక్కువే వస్తుందని చెప్పడమే అందరిని ఆలోచనలో పడేసింది.
ఎలా చూసినా ఏపీలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారాయి. వైసీపీ గెలవడమే గగనం అనే ప్రచారం జరుగుతుండగా జగన్ మాత్రం ఓ అడుగు ముందుకేసి ఒక్క సీటు ఎక్కువ వస్తోందని ప్రకటించడం వైసీపీ ఓటమిని పరోక్షంగా అంగీకరించినట్లుగా ఉందని…కాకపోతే ఆయన వ్యాఖ్యల వెనుక ఏదో మర్మం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే, జగన్ తో సహా ఆ పార్టీ నేతల్లో అతికొద్ది మాత్రమే వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పడం వెనక ఏదో మతలబు ఉందన్న టాక్ వినిపిస్తోంది. గెలుపు విషయంలో వెనక్కి తగ్గి మాట్లాడితే అధికార యంత్రాంగంపై పట్టు సడలుతుందని , కౌంటింగ్ రోజున ఏజెంట్లు సైతం భయపడతారని అందుకే ఎట్టి పరిస్థితుల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేయాలని వైసీపీ నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.