‘జస్టిస్ ఫర్ దిషా’ ఉదంతం దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎప్పటిలా మీడియా ఫోకస్ అంతా దానిమీదే. కొవ్వొత్తులు వెలిగాయి. గొంతులు లేచాయి. రిప్లు పెట్టీ పెట్టీ వేళ్లు నొప్పు పుట్టాయి. ఫేస్ బుక్‌లో అయితే విషాద కవిత్వాలు పొంగుకొచ్చాయి. ప్రతీ చోటా అదే టాపిక్కు. చిత్రసీమ కూడా అలవాటు ప్రకారం గళం విప్పింది. చిరంజీవి, మహేష్‌బాబు, పవన్ కల్యాణ్, రవితేజ – ఒక్కరేమిటి? ఈ టాపిక్‌పై మాట్లాడని వ్యక్తులు లేరు. ఆడియో ఫంక్షన్, సినిమా ఫంక్షన్.. ఏదైనా సరే ముందు ‘జస్టిస్ ఫర్ దిషా’ని గుర్తు చేసుకుంటున్నారు. తప్పులేదు… జరిగిన విషాదం అలాంటిది.
కానీ చిత్రసీమ ఇంకేం చేయలేదా? ఇంతకు మించి ఆలోచించలేదా? జరిగిందో ఘాతుకం. దానికీ చిత్రసీమకూ సంబంధం ఏమిటి? ఇంతకు మించి ఏం చేయగలరు? నిజమే. కానీ ‘ఆడవాళ్లకు రక్షణ లేదు’ అంటూ నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు కదా, చిత్రసీమలో మాత్రం ఆడవాళ్లకు రక్షణ ఉందా? ఉంటే `మీ టూ` లాంటి ఉద్యమాలు జరుగుతాయా? సినిమా అవకాశం కోసం ఫిల్మ్‌నగర్‌లో అడుగుపెట్టే అమ్మాయిల వంక ఎన్ని కళ్లు ఆశగా చూడడం లేదూ..? కమిట్మెంట్ల పేరుతో తెర వెనుక ఎన్ని ఆఘాయిత్యాలు జరగడం లేదు..? ఇవన్నీ చిత్రసీమ ఆపగలదా? ఇక నుంచి మా చిత్రసీమలో ఆడవాళ్లకు పూర్తి రక్షణ ఉంది? అనే మాట ఎవరైనా అనగలరా? అంత భరోసా ఇవ్వగలరా?
ఇది అసాధ్యం అనుకుందాం. కనీసం తెరపైనైనా ఆడవాళ్లని గౌరవంగా చూపిస్తున్నారా? అంగాంగ ప్రదర్శనలు, ప్రేమ కథల పేరుతో విచ్చలవిడితనం. ఇదే కదా మన సినిమాల్లో ఉన్నది. యువతరం బలహీనతల్ని సొమ్ము చేసుకోవడానికి ఎన్ని అడ్డదారులు తొక్కడం లేదు.? సమాజంలో జరుగుతున్న అత్యాచారాలకు సినిమాలకూ ఏమాత్రం ప్రత్యక్ష సంబంధం లేకపోవొచ్చు. కానీ బలహీనత్ని రెచ్చగొట్టి – కామవంఛని ప్రేరేపించడంలో సినిమాలు తమ వంతు పాత్రని పోషించడం లేదా? ఈ రోజుల్లో ఏ కథానాయికకు పొందికైన పాత్రలు ఇస్తున్నారు? సంప్రదాయంగా చూపిస్తున్నారు? ఇవన్నీ ప్రశ్నలే. సమాధానాలు మాత్రం చేదుగా ఉంటాయి. హీరోయిన్ పాత్రల్ని తీర్చిదిద్దుతున్న తీరు చూస్తుంటే.. ఆడవాళ్లకు ఇచ్చే గౌరవం ఏమిటో అర్థం అవుతుంది. వాళ్లతో బూతులు మాట్లాడించడం ఫ్యాషన్ అయిపోయింది. తెరపై ఇంత విచ్చలవిడిగా పాత్రల్ని తీర్చిదిద్దుతూ సమాజంలో మాత్రం గౌరవం ఇవ్వండి అంటే ఎలా?
ముందు సినిమాలు మారాలి. సినిమాల్లో కథానాయిక పాత్రని చూపించే విధానం మారాలి. ఆడవాళ్లకు ఇచ్చే గౌరవం మారాలి. ఆ తరవాత.. స్పీచులు దంచికొట్టినా ఓ అర్థం ఉంటుంది. లేదంటే ఎవరెన్ని చెప్పినా దయ్యాలు వేదాలు వల్లించినట్టే అవుతుంది.