త్రిపుర అసెంబ్లీ ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి..! భాజపా గెలుస్తుందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ ముందే చెప్పినా… సీపీఎం ఇంత దారుణంగా తుడిచిపెట్టుకుని పోతుందని ఎవ్వరూ ఊహించలేదు. దేశంలో వామపక్షాల ఉనికి కాస్త బలంగా ఉన్న రాష్ట్రాల్లో త్రిపుర ఒకటి. ఇక, వారికి మిగిలింది కేవలం కేరళ మాత్రమే..! గడచిన 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న మాణిక్ సర్కారును భాజపా ఇంటికి పంపింది. విశేషం ఏంటంటే… స్థానికంగా మాణిక్ సర్కారుకు ధీటైన నాయకుడు కూడా భాజపా తరఫున బరిలోకి దిగిందీ లేదు. కేవలం మోడీ హవా మీదే భాజపా ఆధారపడింది. గత ఎన్నికల్లో త్రిపురలో భాజపాకి కేవలం 1.45 శాతం ఓట్లు మాత్రమేపడ్డాయి. అంటే, భాజపా అక్కడ సోదిలోనే లేదు. కానీ, ఇవాళ్ల ఏకంగా తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే శక్తిమంతంగా ఎదిగింది. అయితే, భాజపా కూడా ఊహించని ఈ అనూహ్య విజయం వెనక బలంగా పనిచేసిన సమీకరణాలు ఏంటనే చర్చకు ఇప్పుడు తెర లేచింది.
త్రిపురలో భాజపాని విజయం వైపు నడించిన ఏకైక నినాదం.. ‘చలో పల్టాయి’, అంటే, ‘ఇక మార్చుదాం’. ప్రజల్లోకి బలంగా వెళ్లిన మాట ఇది. మరీముఖ్యంగా యువతను బాగా ప్రభావితం చేసింది. ఎందుకంటే, గడచిన పాతికేళ్లుగా ఒకే రకమైన ప్రభుత్వాన్ని వారు చూస్తూ వచ్చారు. సీపీఎం అధికారంలో అద్భుతాలూ అనూహ్య మార్పులూ ఏవీ లేకుండా పోయాయి. పాలనలో మార్పు లేకపోవడం వల్లనే ఇంకా పేదరికంలో మిగిలిపోతున్నాం అనే భావజాలం అక్కడి ప్రజల్లో బాగా పెరిగింది. దేశంలోనే నిరుపేద ముఖ్యమంత్రిగా మాణిక్ సర్కారు ఈ మధ్య వార్తల్లో నిలిచారు కూడా. ఇది కొలమానం కాకపోయినా… పేదరికంలో ప్రజలున్నారని మరో కోణంలో చూపిన అంశం ఇది. మొత్తంగా, స్తబ్దత నుంచి మార్పువైపు వెళ్లాలన్న నిర్ణయానికి ప్రజలు వచ్చారు. ఆ మార్పునకు ప్రతీకగా ప్రధాని నరేంద్ర మోడీ అక్కడి ప్రజలకు కనిపించారు. త్రిపుర ప్రజల ఆలోచనా విధానంలో వచ్చిన ఈ మార్పును సీపీఎం గుర్తించలేకపోయింది. ఫలితం.. ఇవాళ్ల దేశవ్యాప్తంగా వారి మనగడనే ప్రశ్నార్థకం చేసిన ఫలితాలు చవిచూడాల్సి వస్తోంది.
మరో గణనీయమైన మార్పు ఏంటంటే… ఇన్నాళ్లూ వామపక్షాలను ఆదరించేవారు, వారికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని చూసేవారు. కానీ, త్రిపుర ఫలితాలతో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సంప్రదాయ వామపక్ష భావజాలంతో ఉన్నవారికి భాజపా కూడా నచ్చింది. అంటే, ఇక్కడ వామపక్షాలు విశ్లేషించుకోవాల్సింది భాజపాలో ప్రజలకు కనిపించిన ప్లస్ పాయింట్లు ఏంటనేవి కావు… వారిలో పెరుగుతున్న మైనస్ లు ఏంటనేవి తెలుసుకోవాలి..! మొత్తానికి, అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చిన మాణిక్ సర్కారు శకానికి భాజపా బ్రేక్ వేసింది.