కొన్ని సినిమాల ప్రభావం నుంచి అటు దర్శకులు, ఇటు హీరోలూ ఏమాత్రం బయటపడరు. పోకిరి ఎఫెక్ట్ నుంచి తప్పుకోవడానికి మహేష్ బాబుకి ఏళ్లకు ఏళ్లు పట్టింది. సింహాద్రి తరవాత… ఎన్టీఆర్ పరిస్థితి కూడా ఇంతే. ఛత్రపతి ప్రభావం ప్రభాస్ పై చాలా కాలం ఉండిపోయింది. అత్తారింటికి దారేది ఎఫెక్ట్ నుంచి..పవన్ కల్యాణ్ చాలా త్వరగానే బయటపడిపోయాడు. అయితే త్రివిక్రమ్ మాత్రం ఇంకా అందులోనే ఉండిపోయినట్టున్నాడు. సన్నాప్ సత్యమూర్తి విషయంలో అదే అనిపించింది. కుటుంబ బంధాల్ని, హీరో క్యారెక్టర్ని పోట్రయిట్ చేయడంలో త్రివిక్రమ్ అత్తారింటికి దారేది ఎఫెక్ట్ నుంచి బయటపడలేదు అనిపించింది. ఇప్పుడు అ.. ఆలోనూ అదే సీన్ రిపీట్ అవ్వబోతున్నట్టు టాక్.
త్రివిక్రమ్ – నితిన్‌ల కలయికలో రూపుదిద్దుకొంటున్న చిత్రం అఆ. సమంత కథానాయికగా నటిస్తోంది. ఈ కథ, అత్తారింటికి దారేది కథ ఇంచుమించు ఒకేలా ఉంటాయన్నది లేటెస్ట్ టాక్. దూరమైన రెండు కుటుంబాలను కథానాయకుడు దగ్గర చేసే ప్రయత్నం ఈ చిత్రమట. అత్తారింటికి దారేది.. చాలా పాలీష్గా, అర్బన్ నేపథ్యంలో సాగుతుంది. అయితే అఆ మాత్రం పల్లెటూర్లో జరిగే కథ. బ్యాక్ గ్రౌండ్ మారడం తప్పించి.. రెండు సినిమాలకూ పెద్ద తేడా ఏం లేదన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. అత్తారింటికి దారేదిలో పవన్‌కి ఇద్దరు మరదళ్లు. ఇక్కడ నితిన్‌కీ అంతే నట. సమంత, అనుపమ పరమేశ్వరన్ నితిన్‌కి మరదళ్లుగా కనిపిస్తారట. డబ్బుండి కూడా చాలా సాధారణమైన జీవితాన్ని గడిపే పాత్రలో నితిన్ కనిపిస్తాడట. చూస్తుంటే.. అత్తారింటికి దారేది 2గానే కనిపిస్తోంది. మరి… పాత కథే అయినా త్రివిక్రమ్ తన మాటల మ్యాజిక్‌తో కొత్త ఫ్లేవర్ ఏమైనా అద్దే ప్రయత్నం చేస్తాడేమో చూడాలి. లేదంటే.. తన సినిమాని తానే కాపీ కొట్టుకొన్నాడన్న అపప్రద త్రివిక్రమ్‌కి తప్పకపోవొచ్చు.