తెలంగాణ ప్రభుత్వంలో అవినీతిని బయట పెడతామని తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఇంత కాలం చెబుతూ వచ్చిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు ఆర్టీఐ దరఖాస్తులు చేసి మీడియాకు ఇక టీఆర్ఎస్కు చుక్కలే అనే రీతిలో సమాచారం పంపారు. అయితే ఆయన పెట్టిన ఆర్టీఐ ఆర్జీలన్నీ రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు చెందినవే. ప్రగతి భవన్ నిర్మాణం మొదలు ప్రభుత్వ ప్రకటనల వరకు అన్ని శాఖల నుంచి సమాచారం కోరుతూ దరఖాస్తు చేశారు. ప్రజా కోర్టులో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకే సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుంటున్నామని బీజేపీ నేతలు చెబుతున్నారు.
అందులో ఏమైనా తేడా సమాచారం ఉంటే ప్రభుత్వమే ఇవ్వదు. ఏదో ఒకటి చెబుతుంది. ఆ మాత్రం బండి సంజయ్కు తెలియకుండా ఉంటుందా ? అని ఆయన ఆర్టీఐ దరఖాస్తల హడావుడిపై సొంత పార్టీలోనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణ నేతలపై గురి పెడతాయన్న ప్రచారం జరుగుతోంది. అందులో ఎంత నిజముందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే చాలా కాలం నుంచి ఈ రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి.
ఇతర రాష్ట్రాల్లో విరుచుకుపడుతున్నాయి కానీ తెలంగాణపై మాత్రం ఇంత వరకూ దృష్టి పెట్టలేదు. ఇక ముందు పెడతాయని కూడా పెద్దగా ఎవరూ నమ్మడం లేదు. నిజానికి కేసీఆర్ అవినీతి సమాచారం ఆర్టీఐ దరఖాస్తులతో వస్తుందనుకోవడం కష్టం. అయితే కేంద్ర ప్రభుత్వం తల్చుకుంటే మాత్రం సులువుగా ఆర్టీఐ దరకాస్తులతో పని లేకుండానే బయటకు వస్తాయి. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బండి సంజయ్ ఇప్పుడు కొత్తగా ఆర్టీఐ పేరుతో హడావుడి చేయడం.. ఆయన దగ్గర ఎలాంటి సమాచారం లేదనే విషయాన్ని రుజువు చేస్తోందని టీఆర్ఎస్ నేతలు సెటైర్లు వేసే పరిస్థితి ఏర్పడింది.