ఏపీ ఎంపీలు ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానంపై తెరాస మల్లగుల్లాలు పడుతున్నట్టు నిన్ననే గుసగుసలు వినిపించాయి. ఈరోజు పార్లమెంటులో తెరాస సభ్యులు అనుసరించిన తీరు చూస్తుంటే.. ఆ కథనాలకు బలం చేకూరేలానే ఉంది. సభ సజావుగా సాగితే తప్ప, అవిశ్వాస తీర్మానంపై చర్చ ఉండదని స్పీకర్ సుమిత్రా మహాజన్ చాలా స్పష్టంగా శుక్రవారం నుంచీ చెబుతూనే వచ్చారు. ఇవాళ్ల కూడా అదే కారణంతో సభను రేపటికి వాయిదా వేశారు. అయితే, ఇవాళ్ల సభలో తెరాస సభ్యులు ఆందోళనకు దిగడమే ఇప్పుడు చర్చనీయం అవుతోంది. తెరాస ఎంపీల తీరుపై ఏపీ అధికార, ప్రతిపక్ష నేతలు విమర్శలు ప్రారంభించేశారు.
లోక్ సభలో తెరాస వ్యూహం ఏంటో తమకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్. రిజర్వేషన్ల పేరుతో లోక్ సభలో హడావుడి చేయడం సరికాదనీ, అది రాష్ట్ర స్థాయి సమస్య, దాన్ని పార్లమెంటుతో ముడిపెట్టి ఆందోళన చేయడం ద్వారా కేసీఆర్ ఇస్తున్న సందేశం ఏంటని ఆయన విమర్శించారు. ఏపీ సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం అన్యాయం అన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎంపీ వరప్రసాద్ కూడా ఇదే తరహాలో తెరాసపై మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం తాము ప్రయత్నిస్తున్న తరుణంలోనే తెరాస ఎంపీలు ఆందోళన చేయడం సరికాదనీ, దయచేసి వెన్నుపోటు పొడవొద్దని వరప్రసాద్ కోరారు. ఏదో ఒక నెపం చూపించి, సభను వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
సభ వాయిదా పడటానికి పరోక్షంగా తెరాస ఎంపీలు కారకులు అవుతున్నారన్న అభిప్రాయమే ఏపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. తాను ఏర్పాటు చేయబోతున్న ఫ్రెంట్… కాంగ్రెస్, భాజపాయేతరంగా ఉంటుందని కేసీఆర్ చెప్తూ వస్తున్నారు కదా. మరి, ఆ స్ఫూర్తిని తెరాస ప్రదర్శించడం లేదనే చర్చ ఇప్పుడు మొదలైంది. అంతేకాదు, కేసీఆర్ ఏర్పాటు చేయబోతున్న థర్డ్ ఫ్రెంట్ కి బ్యాక్ ఎండ్ లో మోడీ ఉన్నారన్న విమర్శలు కాంగ్రెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు లోక్ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్న సమయంలో తెరాస ఎంపీలు అనుసరించిన వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలి..? కొన్ని అనుమానాలకు తావిచ్చేట్టుగానే ఆ పార్టీ ఎంపీలు సభలో వ్యవహరించారనే చర్చ మొదలైంది.