హుజూరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా … సీఎం కేసీఆర్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 16వ తేదీన హుజూరాబాద్‌లో రైతు బంధు ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్లో యువనేతగా ఉన్నారు. విద్యార్థి నాయకుడిగా గుర్తింపు ఉంది. ఆయన హుజూరాబాద్ నియోజకవర్గంలోనే వీణవంక గ్రామానికి చెందినవారు. బీసీకే చాన్సివ్వాలని కేసీఆర్ ముందుగానే డిసైడయ్యారు. అందుకే పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ప్రకటించి సైడ్ చేశారు.
టీఆర్ఎస్ నుంచి వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ఎల్.రమణ వంటి వారి పేర్లు ప్రచారంలోకి ఉన్నాయి. కానీ.. అధిష్టానం శ్రీనివాస్ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. హైకమాండ్ నంచి సంకేతాలు ఉండటంతో గెల్లు శ్రీనివాస్ గ్రామాలలో చురుగ్గా తిరుగుతున్నారు. ఈటలకు ఉద్యమనాయకుడిగా పేరు ఉంది. అందుకే ఆయనపై టీఆర్ఎస్లో ఇటీవల చేరిన వాళ్లను పోటీ పెట్టడం కన్నా.. ఉద్యమంలో చురుగ్గా ఉన్న వారినే ఎంపిక చేసుకోవాలనుకుంటున్నారు. గెల్లు శ్రీనివాస్‌పై తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనపై వందకు పైగా కేసులు నమోదయ్యాయి. జైలు జీవితం కూడా గడిపారు. ప్రస్తుతం టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు.
గెల్లు శ్రీనివాస్ యాదవ్ కేటీఆర్‌కు సన్నిహితుడు. ఇలా అన్ని రకాల సమీకరణాలు కలసి రావడంతో .. కేసీఆర్ ఆయన వైపే మొగ్గు చూపుతున్నారని టీఆర్ఎస్ నేతలు ఓ నిర్ణయానికి వచ్చారు. పదహారో తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా ఆయనను దళిత బంధు వేదికపై నుంచి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఎవరూ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థిత్వంపై అభ్యంతరం చెప్పకుండా.. పార్టీలో చేరిన వారందరికీ… పదవులు ఇవ్వడం.. బుజ్జగించడం ఇప్పటికే ప్రారంభించారు.