తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… అసెంబ్లీని రద్దు చేసినప్పుడు కానీ.. ఆ తర్వాత కానీ.. మళ్లీ అధికారం చేపట్టబోయేది టీఆర్ఎస్నేనన్న అభిప్రాయం గట్టిగానే వినిపించేది. అందుకే.. 105 మంది అభ్యర్థుల జాబితాను అదీ కూడా.. సిట్టింగ్‌లు అందరికీ టిక్కెట్లు ఇచ్చినా… పెద్దగా వ్యతిరేకత రాలేదు. మొదట్లో తమలో తాము కుమిలిపోయారు నేతలు. ఎదురు తిరిగితే.. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు.. ఆయన సంగతి తెలుసు కాబట్టి ఇబ్బంది పడతామేమో అనేది చాలా మంది సందేహం. కానీ ఇలాంటి భయం.. ఒకటి , రెండు రోజులు మాత్రమే ఉంది. ఆదిలాబాద్ నుంచి రమేష్ రాథోడ్.. తిరుగుబాటు పర్వం ప్రారంభించారు. భారీ ర్యాలీ నిర్వహించి… ఖానాపూర్ లో కేసీఆర్ పోటీ చేసినా తానే గెలుస్తానని సవాల్ చేశాలు. అప్పట్నుంచి… టీఆర్ఎస్లో అసంతృప్తి పెరిగిపోయింది. అయితే.. రచ్చ చేయడం వల్ల ఏమి ఉపయోగం ఉంటుందనుకుంటున్నారో ఏమో కానీ.. టిక్కెట్లు ఖరారు చేసుకుని… కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు.
ఆదిలాబాద్ నుంచి రమేష్ రాథోడ్, వరంగల్ నుంచి కొండా సురేఖ, నల్లగొండ నుంచి బాలూనాయక్, నిజాబామాద్ నుంచి భూపతి రెడ్డి.. రేపోమాపో చేరబోయే డీఎస్… ఖమ్మం జిల్లా నుంచి మదన్ లాల్ సహా.. అనేక మంది నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికి కారు దిగి.. హస్తం చేయి పట్టుకోవడానికి సిద్ధమైన వారు ఉన్నారు. ఈ దిశగా చర్చలు కూడా సాగిస్తున్నారు. అయితే అందరి లక్ష్యం టిక్కెట్టే. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. అధికార పార్టీ అనే నేత ట్యాగ్ కోసం.. ఆ పార్టీలో చేరిపోయిన వారు.. ఎన్నికలు దగ్గర పడటంతో మళ్లీ పాత గూటికి వచ్చేస్తున్నారు. చివరికి బాబూమోహన్ కూడా జంప్ అయ్యారు. బీజేపీలో చేరిపోయారు. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ కూడా టీఆరెఎస్ కు గుడ్ బై చెప్పే పనిలో ఉన్నారు. గెలిచే పార్టీ అన్న నమ్మకాన్ని వీళ్లేవరూ పెద్దగా పెట్టుకోకపోవడమే అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
వంద సీట్లు ఖాయం అని కేసీఆర్ కుండ బద్దలు కొట్టి చెబుతున్నా… మహాకూటమిగా ఏర్పడటం.. వరుసగా…వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలన్నీ… కేసీఆర్‌కు.. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓట్ల పోలరైజేషన్‌కు కారణమవుతూండటంతో.. గెలిచే పార్టీ అనే ట్యాగ్‌ను టీఆర్ఎస్ మెల్లగా పోగొట్టుకుంటోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.