తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక దానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థిని ప్రకటించారు. మరో దాని ఊసు ఎత్తలేదు. అక్కడ పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. అంతేకాదు.. పోటీ చేసి పరువు తీసుకోవడం ఎందుకన్న సలహాలు ఇస్తున్నారు. దాంతో కేసీఆర్ కూడా పునరాలోచనలో పడినట్లుగా చెబుతున్నారు. ఒకప్పుడు కేసీఆర్.. గ్రేటర్ ఎన్నికల్లో బలం లేక పోటీకి దిగేవారు కాదు. ఆ తర్వాత తిరుగులేని స్థానానికి చేరుకున్నారు. ఇప్పుడు… అలాంటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి.
వరంగల్ ఖమ్మం, నల్గొండ స్థానానికి పల్లా రాజేశ్వరరెడ్డిని కేసీఆర్ బరిలోకి దించారు. ఆయన ప్రచారం కూడా ఉధృతంగా చేస్తున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి మాత్రం అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీకి ఎవరూ ముందుకు రావడం లేదు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కు టిక్కెట్ ఖరారు చేశారు. కానీ ఆయన తన వల్ల కాదని చేతులెత్తేశారు. తర్వాత గతంలో ఓడిపోయిన దేవీ ప్రసాద్‌ని పిలిచారు. ఓ సారి ఓడించింది చాలని ఆయన సైలెంటయ్యారు. ఈ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ ఎప్పుడూ గెలవలేదు. ఉద్యమ సమయంలో అయినా .. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా గెలవలేదు.
స్వరాష్ట్రం వచ్చిన కొన్నాళ్లకే.. 2015లో ఎంతో నమ్మకంతో టీఎన్జీఓ యూనియన్ అధ్యక్షుడుగా ఉన్న దేవీ ప్రసాద్‌ను ఉద్యోగానికి రాజీనామా చేయించి బరిలోకి దింపారు. ఆయన కూడా ఓటమి పాలయ్యాడు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం తర్వాత మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన జీవన్ రెడ్డి అనూహ్య విజయం సాధించారు. ఈ పరిస్థితులన్నీ టీఆర్ఎస్ నేతల్లో పోటీకి దూరంగా ఉండాలన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నాయి. ఈ స్థానంలో పోటీకి దూరంగా ఉండేందుకే టీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు చర్చ సాగుతోంది. ఈ నెల 23 వరకే నానినేషన్స్ వేయడానికి అవకాశం ఉంది. హైకమాండ్ మౌనం చూసి.. పోటీకి దూరమని సులువుగానే ఇతర పార్టీల నేతలు కూడా అంచనా వేస్తున్నారు.