చంద్రబాబు మాజీ పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో.. రూ. రెండు వేల కోట్లు పట్టుబడ్డాయన్న ఓ వార్తను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైన మీడియా శక్తివంచన లేకుండా ప్రయత్నం చేసింది. అందులో టీవీ9ది కీలక పాత్ర. సాక్షి టీవీ, మీడియా ఏం చెప్పినా… ఆ పార్టీకి సంబంధించిన వారు నమ్ముతారేమో కానీ.. ఇతరులు నమ్మరు. కానీ టీవీ9కి ఓ బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్‌ను ఉపయోగించుకుని… నిజంగానే రెండు వేల కోట్లు దొరికాయన్నట్లుగా టీవీ9 కథనాలు వడ్డించింది. మూడు ఇన్ఫ్రా కంపెనీల్లో ఒకటి తమ యజమానిది ఉన్నదన్న సంగతి తెలిసి కూడా.. ఆ విషయాన్ని బయటకు ఎక్కడా పొక్కనీయకుండా.. పకడ్బందీగా.. చంద్రబాబు మాజీ పీఏం ఇంట్లో రూ. రెండు వేల కోట్లు దొరికాయన్న ప్రచారాన్ని ఉధృతంగా చేసింది.
నిపుణుల పేరుతో కొంత మందిని పిలిపించి.. బోర్డులపై గీతలు గిసి..డబ్బులు ఎలా.. తరలించాలో కూడా తెలిపింది. తీరా శ్రీనివాస్ ఇంట్లో.. అలాంటివేమీ లేవని.. పంచనామా రిపోర్టులో బయటకు వచ్చింది. దాంతో… టీవీ9 కూడా యూటర్న్ తీసుకుంది. శ్రీనివాస్ ఇంట్లో రెండు వేల కోట్లు దొరికాయని ప్రచారం జరిగిందంటూ.. బ్రేకింగ్ న్యూస్‌లో వేయడం ప్రారంభించింది. అంతకు ముందు వరకూ… చెప్పినదానికి భిన్నంగా వార్తలు ప్రసారం చేసింది. టీవీ9 తీరు చూసి.. ప్రేక్షకులు కూడా విస్తుపోవాల్సి వచ్చింది. యాజమామ్యం మారిన తర్వాత తమ యజమానులకు అనుకూలమైన రాజకీయ పార్టీకి వ్యతిరేకులకైన రాజకీయ ప్రత్యర్థులపై టీవీ9 బురదచల్లడానికే ప్రధానంగా ఉపయోగపడుతోంది. గతంలో.. రేవంత్ రెడ్డి ఇంట్లో సోదాలు జరిగినప్పుడు.. రూ. వెయ్యి కోట్లంటూ.. విస్తృతంగా ప్రచారం చేసింది. కొన్ని ఫేక్ డాక్యుమెంట్లను కూడా… ఎయిర్ చేసింది.
అప్పుడు కూడా.. రేవంత్ ఇంట్లో ఏమీ దొరకలేదు. రేవంత్ దానిపై… లీగల్ నోటీసులు పంపినా.. టీవీ9 స్పందించలేదు. ఇప్పుడు అదే తరహా వ్యూహాన్ని చంద్రబాబుపై బురదచల్లేందుకు టీవీ9 ఉపయోగించుకుంది. కానీ.. టీడీపీ మాత్రం.. 500 కోట్లకు పరువు నష్టం దాఖలు చేయాలని నిర్ణయించుకుంది. అందుకే.. ప్రచారం జరిగిందని.. తాము చెప్పామన్న కోణానికి మార్చుకుని టీవీ9 జాగ్రత్త పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.