ఎక్కడో రష్యా – ఉక్రెయిన్ పోట్లాడుకుంటున్నాయి. కానీ ఇక్కడ వంట నూనెల ధరలు పెరుగుతున్నాయి. రేపోమాపో పెట్రోల్, డీజిల్ రేటు నూటయాభై దాటిపోతుందని చెబుతూ భయపెడుతున్నారు. ఇప్పుడు కరెంట్ కోతలు కూడా ప్రారంభమయ్యాయి. ఇతర రాష్ట్రాల సంగతేమో కానీ ఇప్పటికే ఏపీ కరెంట్ కోతలకు ఉక్రెయిన్ యుద్ధమే కారణం అని చెబుతున్నారు. బొగ్గు కొరత విపరీతంగా ఏర్పడింది. సరిపడా నిల్వలు లేవు. బకాయిలు చెల్లించనందున ఏపీ ప్లాంట్లకు బొగ్గు ఇవ్వడం లేదని చెబుతున్నారు కానీ.. నిజానికి బొగ్గు గనుల్లో పేలుళ్లకు వాడే ప్రొపెల్లంట్ పౌడర్ కొరత కారణంగా ఉత్పత్తి తగ్గడమేనని చెబుతున్నారు. సింగరేణి సహా పలు బొగ్గు ఉత్పత్తి సంస్థలు ఉక్రెయిన్ నుంచే ప్రొపెల్లంట్ పౌడర్‌ను దిగుమతి చేసుకుంటాయి.
యుద్ధం వల్ల అవి ఆగిపోయాయి.ఈ కారణం ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. కావాల్సినంతగా బొగ్గు ఇవ్వలేమని సింగరేణి సహా బొగ్గు ఉత్పత్తి సంస్థలు తెబుతున్నాయట. దీంతో ఉన్నతాధికారులు హైరానా పడిపోతున్నారు. ఎలా బయటపడాలా అని మేధోమథనం చేస్తున్నారు. బొగ్గు ఎవరెవరికి ఎంత ఇవ్వాలో కేంద్రం నిర్దేశిస్తోంది. దీంతో ఏపీకి దిగుమతికి మాత్రమే ఆప్షన్ ఉంది. కానీ ధర భరించలేనంతగా ఉంది. ఇప్పటికే ఏపీని కరెంట్ కష్టాలు ముంచెత్తాయి.
ధర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు పరిమితంగా ఉన్నాయి. రెండు, మూడు రోజుల పాటు కూడా రావు. పూర్తి స్థాయిలో బొగ్గు వస్తేనే ఆ పరిస్థితి. మరో వైపు విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో బొగ్గు పూర్తి స్థాయిలో అందితేనే కోతలు లేకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక వేళ బొగ్గు కొరత అంటూ ఏర్పడితే ఏపీని చీకట్లు అలుముకుంటాయని జనం భయపడుతున్నారు. బహిరంగ మార్కెట్లో ఎంత పెట్టి కొందామన్నా కరెంట్ దొరకని పరిస్థితి ఇప్పటికే ఏర్పడింది. అందుకే కరెంట్ కోతలు హోరెత్తిపోతున్నాయి.