బ్యాంకులకు భారీగా బాకీ పడి లండన్ కు ఉడాయించిన విజయ్ మాల్యా అరెస్టుకు నాన్ బెయిలబుట్ వారెంట్ జారీ అయింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పిటిషన్ పై విచారణ జరిపిన ముంబై ప్రత్యేక కోర్టు, వారెంట్ జారీ చేసింది. ఇంత వరకూసరే, ఈ వారెంట్ ఆధారంగా ఈడీ అధికారులు మాల్యాను భారత్ కు రప్పించగలరా అనేది ప్రశ్న.
వడ్డీతో కలిపి, బ్యాంకుకు 7 వేల కోట్ల రూపాయలకు పైగా బాకీ పడ్డ విజఃయ్ మాల్యా ఇక్కడే ఉన్నప్పుడు సరైన స్పంద లేదు. కనీసం వేల కోట్లు అప్పులిచ్చిన బ్యాంకులు కూడా అతడు విదేశాలకు పారిపోకుండా చెక్ పెట్టడానికి సకాలంలో ప్రయత్నించలేదు. తీరా బ్యాంకులన్నీ కూడబలుక్కుని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ విచారణ మొదలయ్యేలోగా మాల్యా లండన్ చేరిపోయాడు. ఇప్పుడు ఈడీ కోరిక మేరకు ప్రత్యేక కోర్టు వారెంట్ జారీ చేసింది. అయితే, ఎక్కడో ఇంగ్లండ్ లో ఉన్న వ్యక్తిని ఈ వారెంట్ ఆధారంగా అరెస్టు చేసి తీసుకు రావాడానికి ఏయే ఫార్మాలిటీస్ ఉన్నాయనేది ఆసక్తికరం.
బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో తీసుకున్న సొమ్మును మాల్యా అక్రమంగా విదేశాలకు తరలించాడనేది ఈడీ అభియోగం. అంటే మనీ లాండరింగ్ అన్న మాట. ఈ కేసులో విచారణకు రావాలని మూడు సార్లు మాల్యాకు సమన్లు పంపినా అతడు రాలేదు. ప్రతిసారీ ఏదో ఒక సాకుతో మరింత సమయం కోరాడు. దీంతో అతడి పాస్ పోర్టును రద్దు చేయాలని పాస్ పోర్ట్ విభాగాన్ని ఈడీ కోరింది. ఆ మేరకు అతడి పాస్ పోర్టును కేంద్రం తాత్కాలికంగా రద్దు చేసింది.
ఇప్పుడు మాల్యా అరెస్టుకు వారెంట్ జారీ అయింది. దీని ఆధారంగా, ఇంటర్ పోల్ సహాయంతో అతడిని అరెస్టు చేయించడం ఒక మార్గం. అలా కాకుండా ఈడీ అధికారుల స్వయంగా లండన్ వెళ్లి అరెస్టు చేయడానికి చట్టాలు అనుమతిస్తాయా అనేది ఆలోచించాల్సిన విషయం. మార్గం ఏదైనా, ఒకవేళ మాల్యాను రప్పించగలిగితే అది నేర పరిశోధనలో అతిపెద్ద విజయం అవుతుంది. ఈడీ కేసుతో పాటు బ్యాంకుల బకాయిలు చెల్లించడానికి అతడిపై ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. మరి ఇదంతా జరుగుతుందా, జరిగితే ఎప్పుడు అనేది అప్పుడే చెప్పలేం.