తమిళనాట అత్యంత వివాదాస్పదులు అయిన అతి కొద్ది మంది రాజకీయ నాయకుల్లో ఆయన కూడా ఒకరు. తమిళనాడు లోని కామన్ మ్యాన్ గళాన్ని నిర్మొహమాటంగా వినిపించడం, కేంద్రంలోని పలువురు పెద్దలకు, ప్రధానంగా ఉత్తరాది ప్రాధాన్యంతో ఉండే నాయకులకు రుచించని విధంగా తమిళుల మనస్సులో మెదిలే విషయాలను ఆయన చాలా నిక్కచ్చిగా ప్రస్తావిస్తూ ఉంటారు. శ్రీలంకలోని ఎల్టీటీఈని సమర్థించినా, దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా చేయాలని వాదించినా.. అంత తీవ్రమైన భావజాలాన్ని అంతే తీవ్రంగా వ్యక్తీకరించే వ్యక్తి ఆయన. అయితే ఆయన ఎన్నికల జోలికి సాధారణంగా వెళ్లే రకం కాదు. తమిళనాట ఒక వర్గం ఓటర్లలో తన మాటకు ఎంతో విలువ ఉన్నప్పటికీ.. ఆయన స్వయంగా ఎన్నికల గోదాలోకి దిగి తొడకొట్టి ఇప్పటికి 20 ఏళ్లయింది. మళ్లీ ఈసారి మాత్రం ఎన్నికల్లో పోటీచేస్తున్నాడు.
తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టి నుంచి ఆయన స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. విజయకుమార్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన మూడో కూటమి లో వైగో సారథ్యంలోని ఎండీఎంకే కూడా ఒక కీలక భాగస్వామి. వీరి పార్టీకి 29 సీట్లు కేటాయించారు. ఆ స్థానాలలో ప్రచారాన్ని వైగో ప్రారంభించారు.
అయితే ఇప్పుడు వైగో స్వయంగా ఎమ్మెల్యేగా ఎన్నికల గోదాలోకి అడుగుపెట్టడం అనేది ప్రజాసంక్షేమ కూటమి పేరుతో మూడో కూటమిగా అవతరించిన పార్టీలకు కీలకాంశం. ఈ పార్టీలకు విజయకాంత్ ప్రస్తుత సారధి. ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి. వైగో రాజకీయాసక్తి అనేది విజయకాంత్‌కు టెన్షన్ పుట్టిస్తున్నట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏకంగా తాము అధికారంలోకి వచ్చేస్తామని, తనకు పోటీ అని విజయకాంత్ అనుకోకపోవచ్చు గానీ.. వైగో లాంటి కీలక వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటే.. ఎన్నికల అనంతరం సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడే పరిస్థితి వస్తే.. తన మాట కంటె ఆయన మాటకు విలువ పెరిగిపోతుందని విజయకాంత్ భయం కావొచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.