తమిళనాట మరో రాజకీయ నేత ఆరోగ్యంపై ఆందోళన ప్రారంభమయింది. డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్‌ను నిన్న రాత్రి అత్యవసరంగా ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి పుకార్లను నమ్మవద్దని డీఎండీకే ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది కానీ.. అసలు ఏం జరిగింది..? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అన్న విషయాలను మాత్రం ప్రకటించలేదు. తమిళనాట “నల్ల ఎంజీఆర్”గా అభిమానుల మన్ననలు అందుకున్న ఆయన.. ఇటీవలి కాలంలో అనారోగ్యంతోనే తీవ్రంగా పోరాడుతున్నారు.
దాదాపుగా రెండు నెలల కిందటే.. .. ఆయన వైద్య చికిత్స కోసం .. అమెరికా వెళ్లారు. కరుణానిధి మరణం సమయంలోనూ ఆయన తమిళనాడులో లేరు. కరుణ మరణంపై … తన బాధను వ్యక్తం చేస్తూ… ఓ వీడియోను విడుదల చేశారు. అందులో కన్నీరు పెట్టుకున్నారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడటానికే ఇబ్బంది పడినట్లుగా ఉంది. అలాంటిది రెండు రోజుల క్రితం.. హఠాత్తుగా… కురణానిధి.. స్మారకం వద్దకు వచ్చారు. అర్థరాత్రి దాటిన తర్వాత కుటుంబ సభ్యులు ఆయనను మెరీనా వద్దకు తీసుకు వచ్చారు. నడవడానికే ఇబ్బంది పడుతున్న ఆయనను.. కుటుంబ సభ్యులు పట్టుకుని మెల్లగా కరుణ స్మారకం వద్దకు తీసుకెళ్లారు. కరుణకు నివాళి అర్పించి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది.
అయితే అమెరికాలో చికిత్స తీసుకుని వచ్చిన నాలుగైదు రోజులు కాక ముందే మళ్లీ పరిస్థితి విషమించడంతో చెన్నై ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్య సమాచారం గోప్యంగానే ఉంది. తమిళ అగ్రహీరోల్లో ఒకరిగా వెలుగొందిన ఆయన కెప్టెన్ ప్రభాకర్ అనే సినిమాతో తెలుగులోనూ ఓ తరం సినీ ప్రేక్షకులకు అభిమాన హీరోగా మారారు. తర్వతా డీఎండీకే పార్టీని స్థాపించి రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. మొదటి సారి.. తను ఒక్కడే గెలిచినప్పటికీ.. తర్వతా జయలలితతో పొత్తు పెట్టుకుని విజయం సాధించారు. అయితే.. తర్వాత జయలలిత డీఎండీకే పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయడంతో.. బయటకు వచ్చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను కూడా గెలవలేకపోయారు. ఆరోగ్యం బాగోలేక ఎన్నికలపై దృష్టి పెట్టలేకపోయారు. ఇప్పుడు ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని ప్రచారం జరుగుతోంది.