సొంత తల్లిపై కూడా జగన్ ఒకే ఫార్ములా అమలు చేస్తున్నారు. విజయమ్మ రాసిన బహిరంగలేఖకు పోటీగా ఓ బహిరంగలేఖను వైసీపీ పేరు మీద విడుదల చేశారు. ఇందులో షర్మిలపై ఎన్ని ఆరోపణలు చేశారో … తల్లి విజయమ్మపైనా అన్ని ఆరోపణలు చేశారు. జగన్ రెడ్డి బెయిల్ రద్దు చేయించే కుట్రలో విజయమ్మ భాగస్వామిగా మారారని ఏ మాత్రం ఆలోచించకుండా అనేశారు. జగన్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేసి ఆయన జైల్లో ఉన్నప్పుడు చెప్పినట్టల్లా చేసి.. చివరికి అసెంబ్లీలో బొత్స లాంటి వాళ్లతో నానా మాటలు పడిన విజయమ్మను కూడా చివరికి తనపై కుట్ర చేశారని జగన్ ఆరోపించేశారు.
ప్రపంచం అంతా తన పై కుట్ర చేస్తోందని జగన్ రెడ్డి ఫీలవుతూంటారు. చివరికి తల్లి కూడా అలా చేసిందని చెప్పడం ఆయన మానసిక పరిస్థితికి అద్దం పడుతోంది. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యను ఎన్సీఎల్టీదాకా తీసుకెళ్లి … చివరికి రోడ్డు మీదకు కుటుంబాన్ని లాగిన ఆయన వ్యవహారం చూసి వైఎస్ కుటుంబంలో అందరూ అసహ్యించుకుంటున్నారు. రేపు ఆయనను సొంత పిల్లలు అయినా నమ్ముతారో లేదో అన్నట్లుగా వ్యవహారశైలి ఉంది. సొంత తల్లినే ఇలా అవమానిస్తున్న వారికి ఇక సెంటిమెంట్స్ ఉంటాయని అనుకోవడానికి లేదు.
అటు షర్మిల, ఇటు విజమయ్మ ఆస్తుల విషయంలో ఏం జరిగిందో పదే పదే చెబుతున్నారు. ఆస్తులు పంచలేదని.. అవన్నీ కుటుంబ ఆస్తులేనని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏం చెప్పేవాడో కూడా అందరికీ చెబుతున్నారు . వాటిని ఖండించడం లేదు. కానీ ఆస్తులన్నీ తన స్వార్జితాలని ఆయన అంటున్నారు . ఆ ఆస్తుల కోసం తాను జైలుకెళ్లానని అంటున్నారు. అంతే కానీ ఆస్తులను పంచుతానని మాత్రం చెప్పడం లేదు. ఎవరు ఎటు పోయినా… నా దారి నాదేనని జగన్ రెడ్డి తేల్చేస్తున్నారు.