వైసీపీ తరఫున రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థిగా విజయసాయి రెడ్డి పేరును ఖరారు చేయడంపై టీడీపీ మండిపడింది. జగన్ అక్రమ ఆస్తుల కేసులన్నింటిలో విజయసాయి ముద్దాయి. ఒకటీ రెండూ కాదు ఏకంగా సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లలో ఎ1 జగన్ తర్వాత ఎ2 నిందితుడు. అలాంటి నేరస్థుడిని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడం ఏమిటని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రశ్నించారు.
విజయసాయి రెడ్డిని ఆర్థిక నేరస్థుడిగా మంత్రి అభివర్ణించారు. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారనే అభియోగాలను ఎదుర్కొంటూ, చార్జిషీటెడ్ నిందితుడిగా ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి. అయితే ఆయన నేరం చేసినట్టు ఇంకా ఏ కోర్టూ నిర్ధారించలేదు. శిక్ష విధించలేదు. ఇప్పటి వరకూ ఆయన నిందితుడే.
అయితే విజయసాయిని ఎంపిక చేయడానికి సుదీర్ఘ మంతనాలేమీ అవసరం లేదు. చాలా కాలం క్రితమే ఈ విషయాన్ని జగన్ ప్రకటించారు. పార్టీ నేతలకు ఎన్నో సార్లు స్పష్టత ఇచ్చారు. ఇటీవల మైసూరారెడ్డి వైసీపీ కి రాజీనామా చేయడానికి కారణాల్లో ఇదీ ఒకటి అంటారు.
జగన్ తండ్రి సమకాలికుడైన మైసూరా రెడ్డి, వైసీపీలో చేరిన తర్వాత జగన్ కు అనేక విషయాల్లో సలహాలు ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించారు. అయినా, తనకు గుర్తింపునివ్వకుండా విజయసాయి రెడ్డిని రాజ్యసభకు పంపాలని నిర్ణయించారనే ఆవేదనతో మైసూరా రాజీనామా చేశారట.
మైసూరాతో పోలిస్తే విజయసాయిరెడ్డితోనే జగన్ కు పని ఉంది. 11 చార్జిషీట్లలో తనతో సహ నిందితుడిగా, ఎ2గా ఉన్న వ్యక్తి ఎదురు తిరిగితే ఇబ్బంది అవుతుందట. ఆయన అప్రూవర్ గా మారితే కొంప మునుగుతుందని జగన్ భయపడుతున్నానేది టీడీపీ నేతల ఆరోపణ. మంత్రి రఘునాథరెడ్డి కూడా ఇదే ఆరోపణ చేశారు. అన్ని కేసుల్లో సహ నిందితుడిగా ఉన్నా, అప్రూవర్ గా మారనందుకే ఈ నజరానా ఇచ్చారని జగన్ ను విమర్శించారు.
అభ్యర్థిత్వం సరే. తగినన్ని ఓట్లు పొందడం సాధ్యమవుతుందా అనేది ప్రశ్న. వైసీపీ నుంచి మరి కొందరు ఎమ్మెల్యేలను వలవేసి లాక్కోవడానికి టీడీపీ సిద్ధంగా ఉంది. మరి దీన్ని వైసీపీ ఎలా ఎదుర్కొంటుందో చూద్దాం.