విజయశాంతి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారూ అంటే… అదేం ప్రశ్న అనిపిస్తుంది కదా! కానీ, ఇప్పుడామె కాంగ్రెస్ లో ఉన్నారా, ఆ పార్టీ తరఫునే మాట్లాడుతున్నారా, హస్తం తరఫునే భవిష్యత్తు రాజకీయాల్లో కొనసాగేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారా… ఇలాంటి ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీకి చెందినవారే అవును అని పక్కాగా చెప్పలేని పరిస్థితి! రాములమ్మ ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాల గురించిగానీ, ఎదుర్కొంటున్న సంక్షోభం గురించిగానీ ఆమె ఈ మధ్య మాట్లాడిన దాఖలాలు లేవు. అంతేకాదు, పార్టీలో ఇతర నేతలతో చర్చల్లోగానీ, ఇతర సమావేశాల్లోగానీ ఆమె క్రియాశీల పాత్ర వహిస్తూ కనిపించిన సందర్భాలూ కనిపించడం లేదు! ఈ పరిస్థితిని ఆమె కోరి తెచ్చుకున్నారా, లేదంటే పార్టీ నాయకులే కొందరు ఆమెని ఇలాంటి పరిస్థితిలోకి నెడుతున్నారా అనేది ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల పార్టీ కోర్ కమిటీ సమావేశానికి ఆమెని పిలవలేదని విజయశాంతి తాజాగా అలిగారట! ఎన్నికల ముందు ప్రచారానికి తన సేవలు అవసరమయ్యాయిగానీ, కోర్ కమిటీ భేటీలో తనకు ప్రాధాన్యత లేదా అన్నట్టుగా సన్నిహితుల ముందు ఆమె వ్యాఖ్యానించినట్టు సమాచారం. నిజానికి, పార్లమెంటు ఎన్నికల సందర్భంలో ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ గా ఆమె పని చేశారు. అయితే, ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తరువాత… పార్టీ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. నాగార్జున సాగర్ లో జరిగిన పార్టీ సమీక్ష సమావేశానికి ఆమె గైర్హాజరయ్యారు. సొంత జిల్లా సంగారెడ్డిలో కూడా ఓటమిపై పార్టీ సమీక్ష నిర్వహిస్తే… ఆ కార్యక్రమానికి కూడా రాములమ్మ రాలేదు. కీలకమైన సమావేశాలకు ఆమె రాకపోతే ఎవరైనా ఏం చేస్తారు అనేది కొంతమంది కాంగ్రెస్ నాయకుల వాదన!
ఆమె పార్టీ మారాలన్న ఆలోచనలో ఉన్నారు. దశలవారీగా కాంగ్రెస్ కి ఉద్దేశపూర్వకంగా దూరమౌతున్నారనీ కొందరు అభిప్రాయపడుతున్నారు. భాజపాతో ఎలాగూ ఆమెకి మంచి సంబంధాలున్నాయనీ, రాష్ట్రంలో విస్తరణ పనిలో భాజపా ఉంది కాబట్టి, విజయశాంతి కాండువా మార్చే అవకాశం ఉందని అంటున్నవారూ లేకపోలేదు! అలాంటిదేం లేదనీ, కొంతమంది కాంగ్రెస్ నేతలే రాములమ్మను కావాలనే పార్టీలో పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె సన్నిహితులు అంటున్నారు. వాస్తవం ఏంటంటే… కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో రాములమ్మ యాక్టవ్ గా ఉండటం లేదు! ఇది పార్టీ మార్పు ప్రయత్నమా, పార్టీతో ఉద్దేశపూర్వకంగా పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరా అంటే… కొంత విజయశాంతి స్వయంకృతం, మరికొంత పార్టీ వ్యవహార శైలీ రెండూ కారణాలుగానే కనిపిస్తున్నాయి.