పెట్టీ కేసుతో కోర్టుకెళ్లిన పోసానికి ఉరి శిక్ష పడేలా వాదించే లాయర్ సప్తగిరి క్యారెక్టర్ ఉన్న సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఈ సప్తగిరి క్యారెక్టర్ ఇప్పుడు నిజంగానే ఉంది. ఎవరో కాదు మన మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఆయనకు సుప్రీంకోర్టులో వాదించేందుకు అర్హత లేదు కానీ దిగువ కోర్టులో ఆయన చేసిన వాదనలతో సీఐడీ మాజీ అధికారి విజయ్ పాల్‌కు అరెస్టు గండం ఖాయమయింది.
రఘురామకృష్ణరాజును కస్టడీలో హింసించిన కేసులో అప్పటి దర్యాప్తు అధికారి విజయ్ పాల్ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ కేసుపై సోమవారం విచారణ జరిగింది. విచారణ ప్రారంభమైన కాసేపటికి ధర్మాసనం విజయ్ పాల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఎందుకంటే.. ఈ కేసు విషయంలో గతంలో హైకోర్టును పొన్నవోలు సుధాకర్ రెడ్డి బెదిరించడమే. ఆయన హైకోర్టులో వాదనలు వినిపించమంటే జడ్జిల్ని బెదిరించారు. అప్పట్లో ఈ అంశం హాట్ టాపిక్ అయింది. ఇదే విషయాన్ని రఘురామ తరపు న్యాయవాది సిద్ధార్థ లూధ్రా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పొన్నవోలు నిర్వాకంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆశ్చర్యపోయింది. ఆ అంశంపై విజయ్ పాల్ తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే ఆయన వద్ద సమాధానం లేకుండా పోయింది. దీంతో పిటిషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది.
పొన్నవోలు సుధాకర్ రెడ్డి అసలు నిజంగా లాయరో కాదో అన్న డౌట్ ఆయన మాటల్ని విన్న వారికి ఎవరికైనా వస్తుంది. లా పై కనీస పరిజ్ఞానం కూడా ఉండదని ఆయన మీడియాతో మాట్లాడిన ప్రతి సారి అవగతమవుతూనే ఉంటుంది. దీనికి తోడు జడ్జిల్ని బెదిరించడం కూడా ఒకటి. ఈయన చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్టు చేసినప్పుడు సిద్దార్థ లూధ్రా వాదనలను కాదని చంద్రబాబును రిమాండ్ కు పంపించేలా వాదించారని నమ్మాలి.