రాజ్యసభలో ప్యానల్ వైస్ చైర్మన్లుగా ఎనిమిది మందిని నియమిస్తూ రెండు రోజుల కిందట నిర్ణయం తీసుకున్నారు. ఆ ఎనిమిది పేర్లను వెబ్సైట్లో అప్ లోడ్ చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేరు ఎనిమిదో పేరుగా జాబితాలో ఉంది. ఇంకేం ఆయన సోషల్ మీడియా మేనేజర్లకు కావాల్సినంత పని పడింది. పొగడ్తలతో పోస్టులు హోరెత్తించారు. అయితే అసలు కథ రాజ్యసభ సమావేశమైన తొలి రోజు చోటు చేసుకుంది.
రాజ్యసభ చైర్మన్గా కొత్తగా ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్ ధన్ఖడ్ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ప్యానల్ వైస్ చైర్మన్ల జాబితా ప్రకటించారు. ఆ జాబితాలో ఎనిమది మంది ఉండాలి..కానీ ఏడుగురు పేర్లే చదివారు. ఎనిమిదో పేరు చదవలేదు. ఆ పేరు విజయసాయిరెడ్డిది. దీంతో వైసీపీ సభ్యులకు ఏం జరిగిందో అర్థం కాలేదు. జాబితా నుంచి రాజ్యసభ చైర్మనే .. ఆ పేరు తీసేశారని క్లారిటీ రావడంతో వైసీపీ ఎంపీలు సైలెంట్ అయ్యారు.
విజయ సాయిరెడ్డి వ్యక్తిగతంగా ఎలా ఉంటారో చెబుతూ.. ఆయన సోషల్ మీడియా ట్వీట్లు.. ఇతర వ్యవహారశైలిపై ఉపరాష్ట్రపతికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆ సీట్లో ఆయన కూర్చుకుంటే.. రాజ్యసభ గౌరవం తగ్గుతుందని రఘురామ కృష్ణంరాజు లాంటి వాళ్లు ఫిర్యాదులు చేసినట్లుగా తెలుస్తోంది. అన్నీ పరిశీలించిన తర్వాత ధన్ కడ్ .. విజయసాయిరెడ్డిని ప్యానల్ వైస్ చైర్మన్ జాబితాను డ్రాప్ చేసినట్లుగా భావిస్తున్నారు.