వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టు విజయ్ సాయి రెడ్డి. ప్రభుత్వంలో కూడా నెంబర్ టు ఆయనే. అయితే అధికారికంగా ఎలాంటి హోదా లేదు. వైసీపీకి ఉన్న 30 మంది ఎంపీలలో ఆయన ఒకరు. అయితే మిగతా ఎంపీలంతా డమ్మీలాంటి వాళ్ళు అయితే విజయసాయి రెడ్డి మూలవిరాట్లా వ్యవహరిస్తూ ఉంటారు. అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ ఆయన పూర్తిగా చక్రం తిప్పుతూ ఉంటారు. ఢిల్లీలో వ్యవహారాలు చక్కబెట్టినా… తెలంగాణ సర్కార్ తో సంప్రదింపులు జరిపినా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇప్పటివరకు ఆయన వ్యూహాలు వైసీపీకి మెరుగైన ఫలితాలు తీసుకొచ్చాయి. ఇప్పుడు ఆయన వ్యవహారశైలి ఒక్కసారిగా మారిపోయింది. ఎవరితోనూ సఖ్యతగా ఉండటం లేదు. మిత్రులు, శత్రువులు అనే తేడా లేకుండా ఆయన గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారు. ఆయన తీరు వైసీపీ కార్యకర్తలకు అసహనం తెప్పిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఈ విషయంపై అవగాహన ఉందో లేదో కానీ ఆ వైపు నుంచి ఏలాంటి హెచ్చరికలు రావడం లేదు. జగన్మోహన్ రెడ్డి మొహమాటాన్ని ఆసరా చేసుకుని విజయ సాయి రెడ్డి తాను చేస్తున్నదే రాజకీయం అనుకున్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా అందర్నీ తిడుతూ వైసీపీ వైసీపీ ఇమేజ్ ని డామేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
బిజెపిని శత్రువుగా మార్చేస్తున్నారు ఎందుకు?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడంలో భారతీయ జనతా పార్టీ పరోక్ష సహకారం అందించింది. ఈ విషయంలో పెద్దగా అనుమానాలు లేవు. అప్పట్లో చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో కూటమి కట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇది మోడీకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ ఆగ్రహమే వైసీపీకి ప్లస్ పాయింట్ గా మారింది. బీజేపీ పరోక్ష సహకారంతో వైసిపి సులువుగా అధికారాన్ని దక్కించుకుంది. చంద్రబాబు పై మోడీ కోపాన్ని వైసిపి కి అనుకూలంగా మలచుకోవడంలో విజయసాయిరెడ్డి పాత్రను ఎవరూ కాదనలేరు. బీజేపీ తో సత్సంబంధాలు నెలకొల్పడానికి ఆయన ఢిల్లీలో ఎవరికైనా సరే పాద నమస్కారాలు చేయడానికి సిద్ధంగా ఉండేవారు. చేసేవారు కూడా. అవసరం ఉన్నా లేకపోయినా పీఎంవోలో ప్రత్యక్షం అయ్యేవారు. చివరకు విజయసాయి రెడ్డి లాబీయింగ్ ఫలించి వైసీపీని ప్రత్యర్ధి పార్టీగా కాకుండా అప్రకటిత మిత్రపక్షంగా బిజెపి భావిస్తూ వచ్చింది. అలాంటి బీజేపీని ఇప్పుడు విజయసాయి రెడ్డి చేజేతులా దూరం చేస్తున్నారు. కన్నా లక్ష్మీ నారాయణను టిడిపి ఏజెంట్ గా చెప్పడానికి ప్రయత్నిస్తూ వివాదంలోకి బిజెపి హైకమాండ్‌నూ తీసుకొచ్చారు. గత ఎన్నికల్లో బిజెపి ఏపీకి పెద్ద ఎత్తున డబ్బు తీసుకొచ్చిందని తనకు తెలుసు అంటూ బ్లాక్‌మెయిలింగ్ ప్రారంభించేశారు. తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఎవరికైనా ఆగ్రహం రాకుండా ఉంటుందా..?. ఇప్పుడు ఢిల్లీ నుంచి ఇదే రకమైన సమాచారం తాడేపల్లికి అందుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును కట్టడి చేయడానికి ఉపయోగపడుతున్నారని అనుకుంటే రానురాను అలుసుగా తీసుకుంటున్నారన్న అభిప్రాయం బిజెపి పెద్దల్లో ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. కన్నా వ్యవహారంలో బిజెపి పెద్దల ట్వీట్లు కూడా ఇదే నిరూపిస్తున్నాయి.
చీప్ లాంగ్వేజ్ తో వైసీపీ పై చులకన భావం తెస్తున్న విజయ సాయి రెడ్డి.!
విజయ సాయి రెడ్డి చూడటానికి క్లాస్. మాట్లాడటానికి వచ్చేసరికి ఊర మాస్. రాజకీయాల్లోకి వస్తే దారుణమైన భాషను వాడాలని ఆయన అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నట్లు ఉన్నారు. మొదటి నుంచి ఆయన స్థాయి భేదం లేకుండా అందరిపైనా దారుణమైన కామెంట్లు చేస్తూ ఉంటారు. ఆయన ఆధ్వర్యంలో నడిచే సోషల్ మీడియా విభాగం కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గదు. వైసిపి సోషల్ మీడియా టీం తమకు నచ్చని వ్యక్తులను వ్యక్తిగతంగా మాత్రమే టార్గెట్ చేస్తుంది. కుటుంబ సభ్యులను సోషల్ మీడియాలోకి తెచ్చి రచ్చ రచ్చ చేస్తారు. వాళ్లు వీళ్లు అనే తేడా ఉండనే ఉండదు. రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు అయినా రాజ్యాంగ పదవిలో ఉన్న రమేష్ కుమార్ అయినా దీనికి మినహాయింపు కాదు. ఇలా వ్యవహరించ బట్టే రమేష్ కుమార్ తనకు బెదిరింపులు వస్తున్నాయని నేరుగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖ కారణంగా ప్రభుత్వంపై ఓ రకమైన ఫ్యాక్షన్ ముద్ర పడింది. రమేష్ కుమార్ లేఖ కారణంగా తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని వైసీపీ పెద్దలు ఇప్పుడు కంగారు పడుతున్నారు. కానీ విజయసాయి రెడ్డి స్టైల్లో కాకుండా నిమ్మగడ్డ వ్యవహారాన్ని సింపుల్ గా డీల్ చేసి ఉంటే వ్యవహారం లేఖల వరకు వచ్చేది కాదని వైసిపి లోని కొంతమంది సీనియర్ నేతలు బహిరంగంగానే చెప్పుకుంటూ ఉంటారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చిన విజయ సాయి రెడ్డి ఇప్పుడు భారతీయ జనతా పార్టీతోనూ అలాగే వ్యవహరిస్తున్నారని అసహనం వైసీపీలో కనిపిస్తోంది. ఆయన భాష వల్ల వైసిపి అంటే ప్రజల్లో ఓ రకమైన చులకన భావం ఏర్పడిందని… ఎవరు ప్రశ్నించినా దారుణమైన భాషతో ఎదురు దాడి చేస్తారని ప్రజలు నమ్ము తున్నారని వైసీపీ నేతలు హైకమాండ్‌కు మొరపెట్టుకున్నారని చెబుతున్నారు.
విశాఖలో విజయసాయి హంగామా తో పెరిగిపోతున్న అనుమానాలు…!
విజయసాయిరెడ్డికి విశాఖకు ఎలాంటి సంబంధం లేదు. వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా ఆయన విశాఖలో అడుగు పెట్టారు. ఎన్నికలకు ముందే ఆయన విశాఖలో మకాం వేశారు. ఉత్తరాంధ్రలో పార్టీని గెలిపించే బాధ్యత తీసుకున్నారు. విజయం సాధించారు కూడా. అయితే ఆ విజయంతోనే ఆయనకు అహంకారం పెరిగిపోయిందని వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. పార్టీ కోసం కష్ట పడిన వారిని కాకుండా బాగా డబ్బులు పెట్టగలిగే వారిని నేతలుగా గుర్తిస్తున్నారని అసంతృప్తిలో ఉన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ల కోసం ఆయన ఎంచుకున్న పద్ధతి ని చూసి చాలామంది క్యాడర్ అసంతృప్తికి గురయ్యారు. విశాఖకు తానే ముఖ్యమంత్రి అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి మారిపోయింది. కలెక్టర్ దగ్గర నుంచి కిందిస్థాయి ఎస్ఐ వరకు అందరిని తాను అనుకున్న వారినే నియమింపచేశారు. సాధారణంగా స్థానిక నేతలు తాము కోరుకున్న వారిని అధికారులుగా నియమించుకోవాలని అనుకుంటారు. కానీ ఇక్కడ విజయ సాయి రెడ్డి వన్ అండ్ ఓన్లీ. చీమ చిటుక్కుమన్నా విజయసాయిరెడ్డికి తెలియాల్సిందే. అందుకే విశాఖ నేతలు విజయసాయి రెడ్డి పై అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. మంత్రి అవంతి పేరుకే మంత్రి. మొత్తం విజయసాయిరెడ్డి పెత్తనం నడుస్తూ ఉంటుంది. సమీక్ష సమావేశాలు …అధికారిక నిర్ణయాలు… చివరికి రాజధానిగా విశాఖ ఉంటుందని ఆయన డిక్లేర్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం వైసీపీలో విజయసాయిరెడ్డికి ఉన్న పలుకుబడి కారణంగా ఆయనను ఎవరు బహిరంగంగా విమర్శించే పరిస్థితి లేదు. లోపల్లోపలే రగిలిపోతున్నారు.
కట్టడి చేయకపోతే వైసీపీకి గుదిబండే…!
అధికారం శాశ్వతం అనే భ్రమలో విజయ సాయి రెడ్డి ఉన్నారన్న అభిప్రాయం వైసిపి సీనియర్ నేతల్లో ఉంది. అందుకే ముందూ వెనకా చూసుకోకుండా అందరిపైనా ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై ఎలా మాట్లాడినా చెల్లుతుంది ఏమో కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్న అభిప్రాయం వైసిపి సీనియర్లలో వినిపిస్తోంది. ఇప్పటికీ బాగానే ఉంటుంది కానీ రేపు పరిస్థితులు తేడా వస్తే చక్కదిద్దుకోవడం కష్టమవుతుందని అంటున్నారు. ఎలా చూసినా విజయసాయి రెడ్డి రాజకీయం ప్రజలను చిరాకు పెట్టేలా ఉందని అంటున్నారు. అయితే విజయసాయి రెడ్డి హవా ఇప్పుడు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ చాలా ఎక్కువగా ఉంది. ఆయన కనుసైగ చేస్తేనే ఏ పనైనా అవుతుంది. అందుకే వైసీపీ నేతలు సైలెంట్ గా ఉంటున్నారు. పిల్లి మెడలో గంట కట్టే అవకాశం కోసం వారు ఎదురుచూస్తున్నారు.