ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు కోసం భూములు భవనాలను వెదుక్కుంటోంది. ఈ క్రమంలో వారి దృష్టి బీచ్ రోడ్డులో ఉన్న రామానాయుడు స్టూడియోపై పడినట్లుగా తెలుస్తోంది. రామానాయుడు స్టూడియో స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చిందని.. కాబట్టి తిరిగి ఇచ్చేయాలని ప్రభుత్వ పెద్దలు కొంత మంది ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వేరే చోట అంతకు మించి స్థలం ఇస్తామని ప్రతిపాదిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే.. రామానాయుడుకు అత్యంత ఇష్టమైన ఆ స్టూడియోను.. ప్రభుత్వ పరం చేయడానికి కుటుంబసభ్యులు సిద్ధపడటం లేదు. దీంతో.. తమదైన శైలిలో అడుగు ముందుకేసేందుకు విశాఖలో ప్రభుత్వ పెద్దలు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే విశాఖలో రామానాయుడు స్టూడియోను స్వాధీనం చేసుకోవాలని అంతర్గతంగాఆదేశాలు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోదంి. విశాఖలో రామానాయుడు స్టూడియోస్ అద్భుతమైన లొకేషన్లో ఉంటుంది. కొండలపై చూస్తే.. బీచ్ మొత్తం కనిపిస్తుంది. రామానాయుడు టీడీపీ తరపున రెండో సారి బాపట్ల నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మరోసారి రాజకీయాల వైపు చూడకుండా ఉండేందుకు .. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయనకు నజరానాగా విశాఖలో ఫిల్మ్ స్టూడియోకు భూములు కేటాయించారన్న ప్రచారం ఉంది. అయితే ఆ భూములకు రామానాయుడు న్యాయం చేశారు. చిన్నదే అయినా అద్భుతమైన స్టూడియో కట్టారు. నిర్వహణ ఖర్చులు రాకపోయినప్పటికీ.. చక్కగా నిర్వహిస్తూ వస్తున్నారు.
ఇటీవలి కాలంలో.. సినీ ఇండస్ట్రీపై అన్ని రంగాలమీద పడినట్లుగానే కరోనా దెబ్బ పడింది. దాంతో స్టూడియో నిర్వహణ మరింత ఇబ్బందుల్లో పడింది. అయితే రాష్ట్రం విడిపోయినందున ముందు ముందు మంచి భవిష్యత్ ఉందన్న ఉద్దేశంతో విశాఖ స్టూడియోపై మరింత పెట్టుబడి పెట్టాలన్న ఆలోచనలో సురేష్ బాబు ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్లో ఉన్న నానక్ రామ్ గూడ స్టూడియోను రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్కు ఇచ్చేసి.. అలా వచ్చే మొత్తాన్ని విశాఖలో స్టూడియో విస్తరణకు వినియోగిస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏకంగా ఆ స్టూడియోను స్వాధీనం చేసుకోవాలనుకోవడం సంచలనం రేపుతోంది. భూములు కేటాయించినప్పుడు… కొన్ని నిబంధనలు పెడతారు. ఆ నిబంధనల్లో ఏదో ఒకటి పాటించలేదన్న కారణంగా స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలివ్వడానికి అవకాశం ఉంది.
రామానాయుడు స్టూడియోస్వాధీనం చేసుకుని ప్రభుత్వ కార్యాలయాలను పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు.ఇలాంటి స్వాధీన ఆదేశాలు గతంలో ఏపీ సర్కార్ చాలా మందికి ఇచ్చింది. అమరరాజా కంపనీలతో సహా..అనేక మంది కోర్టులకు వెళ్లి.. స్టే తెచ్చుకున్నారు. ఒక వేళ రామానాయుడు స్టూడియో స్వాధీన ఆదేశాలు ఇచ్చినా.. స్వాధీనం చేసుకున్నా.. న్యాయపోరాటం ద్వారా.. సురేష్ సంస్థ మళ్లీ పొందే అవకాశం ఉందని కొంత మందిఅంచనా వేస్తున్నారు. మొత్తానికి నేడో రేపో… రామానాయుడు స్టూడియో అంశం హైలెట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.