ఇప్పటి తరానికి తెలియదు. వెంకయ్యనాయుడు వంటి నేతలు విద్యార్ధి దశలోనే నాయకులుగా మారినప్పుడు.. చేసిన పోరాటాల్లో విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే విజయవంతమైన ఉద్యమం ఉంది. విశాఖలో స్టీల్ ఫ్యాక్టరీ కోసం అనాడు జరిగిన ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారు ఉన్నారు. నాడు ఒక్క విశాఖలో మాత్రమే ఆ ఉద్యమం జరగలేదు. ఏపీ మొత్తం జరిగింది. ఆ ఉద్యమ ఫలితంగానే స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. దేశ మౌలిక సదుపాయాల రంగంలో స్టీల్ ప్లాంట్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతింతై అన్నట్లుగా ఎదిగిన స్టీల్ ప్లాంట్ను ఇప్పుడు నష్టాల పేరుతో ప్రైవేటీకరణ చేస్తున్నారు.
ఇప్పుడు ప్రజలు మళ్లీ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. వందశాతం వాటాలు అమ్మేస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే ప్రజల్లో కనిపించాల్సిన ఎమోషన్ కనిపించలేదు. రాజకీయ పార్టీల్లోనూ కనిపించలేదు. చివరికి ఉత్తరాంధ్ర నేతల్లోనూ కనిపించలేదు. రామ్మోహన్ నాయుడు లాంటి యువ ఎంపీ … మాత్రం దూకుడుగా స్పందిస్తున్నారు. మిగతా వారంతా సైలెంట్ గా ఉండిపోయారు. ప్రాణత్యాగాలు చేసి మరీ తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టేస్తే ఎవరిలోనూ ఎలాంటి చలనం లేదు. ఉత్తరాంధ్రలోనే పెద్దగా ఎవరికీ పట్టకపోతే ఇతర ప్రాంతాల్లోని వారు పట్టించుకునే చాన్స్ లేదు.
రాష్ట్ర రాజధాని అమరావతిని …ఆ ఇరవై తొమ్మిది గ్రామాల సమస్య అన్నట్లుగా చూశారు. వారు పోరాటం చేస్తూంటే.. మాటల్లో కూడా సానుభూతి చూపించలేదు. ఆ అమరావతి అందరి రాజధాని అనే భావనకు రాలేకపోయారు. ఇప్పుడు ఆ పార్టియాలిటీ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ కనిపిస్తోంది. స్టీల్ ప్లాంట్ సమస్య ఒక్క ఉద్యోగులదే అనుకునే పరిస్థితి వస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటూ జరిగితే అది అక్కడి ఉద్యోగులకే ఇబ్బంది కానీ.. ప్రజలకు కాదని అనుకునే పరిస్థితి వచ్చింది. ప్రజల్లోఈ భావనను రాజకీయ పార్టీలు పెంచి పోషిస్తున్నాయి. వారిలో ఐక్యతను దెబ్బతీయడంలో సక్సెస్ అవుతున్నాయి. అమరావతి.. స్టీల్ ప్లాంట్.. ఇలా ఆంధ్రుల అస్తిత్వానికి ప్రతీకగా నిలిచేవాటిని కోల్పోతున్నారు.