ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలుగురు వైకాపా ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీని తెదేపాలో చేర్చుకోవడంతో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఇదే చాలా హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంపై తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించడమే అందుకు ఒక చక్కటి ఉదాహరణ. తనను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న తెదేపా నేతలు, ఇప్పుడు వారి చేత రాజీనామాలు చేయించి ఉపఎన్నికలకి వెళ్ళగలరా? అని ఆయన సవాలు విసిరారు. దానికి తెదేపా నేతలు ఇంకా జావాబు చెప్పవలసి ఉంది. త్వరలో జరుగబోయే వరంగల్, ఖమ్మం మునిసిపల్ ఎన్నికలలో కూడా బహుశః ఈ ప్రస్తావన తప్పకుండా రావచ్చును.
ప్రస్తుతం ఏపిలో ఆ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైకాపాలో తనని తప్ప మిగిలిన అందరు ఎమ్మెల్యేలని తెదేపా నేతలు ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేసారని సాక్షాత్ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డే స్వయంగా చెప్పుకొన్నారు. ఆ పార్టీలో రోజా వంటి నేతలు చంద్రబాబు నాయుడుపై నిప్పులు కురిపిస్తున్నారు. ఆయనకి దమ్ముంటే పార్టీలో చేరిన వైకాపా ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి మళ్ళీ ఎన్నికలకు వెళ్లాలని సవాలు విసురుతున్నారు. భూమానాగి రెడ్డి తెదేపాలో చేరడం వలన ఆయన భార్య స్వర్గీయ శోభానాగిరెడ్డి ఆత్మ చాలా క్షోభిస్తుందని సెంటిమెంటు అస్త్రాన్ని కూడా రోజా ప్రయోగించారు.
ఈ వ్యవహారంపై చాలా తీవ్రంగా స్పందించే ప్రయత్నంలో వైకాపా నేతలు మళ్ళీ మళ్ళీ తప్పటడుగులు వేస్తున్నారు. తెదేపాలో చేరినవారి చేత వారి ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకి వెళ్ళమని సవాలు విసరడం వారికే నష్టం కలిగిస్తుందని గ్రహించడం లేదు. భూమానాగి రెడ్డి, ఆయన కుమార్తె అఖిల ప్రియ, జలీల్ ఖాన్, ఆదినారాయణ రెడ్డి నలుగురూ కూడా పార్టీ బలంతో కాకుండా తమ స్వంత బలంతోనే విజయం సాధించగల సత్తా ఉన్నవారు. ఆ విషయం వైకాపా నేతలకి కూడా తెలుసు. కనుక ఒకవేళ వారు తమ పదవులకు రాజీనామాలు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళితే తప్పకుండా వారే గెలిచే అవకాశాలుంటాయి. అదే జరిగితే దాని వలన వైకాపా పరువే పోతుంది. ఆ విజయం గురించి తెదేపా గొప్పగా ప్రచారం చేసుకోవచ్చును. ఈ సంగతి గ్రహించకుండా స్పీకర్ కోడెల శివప్రసాద రావుని కలిసి వారి రాజీనామాలను తక్షణమే ఆమోదించవలసిందిగా కోరుతామని వైకాపా నేతలు చెపుతున్నారు. అందుకు ఆయన వెంటనే అంగీకరించినట్లయితే దాని వలన నష్టపోయేది వైకాపాయే తప్ప తెదేపా కాదని గ్రహించలేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. సాధారణంగా ఇటువంటి సమయంలో పార్టీ తరపున గట్టిగా వాదించే పార్టీలో సీనియర్ నేతలు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ అందుకే మౌనం వహిస్తున్నారేమో?