వైసీపీ ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణను ప్రణాళిక ప్రకారంగా నవ్వుల పాలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలకు భిన్నమైన ప్రకటనలు చేయమని ప్రోత్సహించి.. ఆ తర్వాత ఆయన మాటలకు విలువ లేనట్లుగా… ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్మీట్లు పెడుతున్నారు. బొత్స చెప్పిన మాటలకు భిన్నమైన ప్రకటనలు చేసి.. అసలు బొత్సకేం తెలీదని.. ఆయనకు ప్రభుత్వంతో సంబందం లేదన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు. తాజాగా అమరరాజా సంస్థ విషయంలో అదే జరిగింది. లాభాలొచ్చే చోటుకు వాళ్లు వెళ్లిపోతున్నారని బొత్స ముందుగా ప్రకటించారు. కానీ తర్వాత అనూహ్యంగా సజ్జల భిన్నమైన ప్రకటన చేశారు.
అమరరాజా కంపెనీని తామే వెళ్లిపొమ్మన్నామని అది కాలుష్య కారక పరిశ్రమ అని సజ్జల వాదించారు. ఆ తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి విజయ్ కుమార్ కూడా ప్రెస్ మీట్ పెట్టి… అమరరాజా సంస్థను తరలించాలని హైకోర్టును కోరామని చెప్పుకొచ్చారు. అయితే బొత్స సత్యనారాయణకు ఈ సమాచారం ఇవ్వలేదు. ఆయన పరిశ్రమల మంత్రి కాదు. కానీ ప్రెస్మీట్ పెట్టి… అమరరాజా గురించి మాట్లాడారు. మాట్లాడమని ఆయనకు సమాచారం రాబట్టే మాట్లాడారని.. కానీ ప్రభుత్వమే పంపేస్తోందన్న తమ విధానాన్ని మాత్రం ఆయనకు చెప్పలేదంటున్నారు. దీంతో బొత్స..ప్రభుత్వాన్ని సమర్థిస్తే.. ఆ సంస్థే వెళ్లిపోతోందన్నట్లుగా మాట్లాడారు. కానీ.. తర్వాత సజ్జల భిన్నంగా మాట్లాడటంతో బొత్స మాటలకు విలువ లేకుండా పోయింది.
వైసీపీలో బొత్స సత్యనారాయణకు ఇప్పుడు గడ్డు పరిస్థితి ఉంది. ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కనీసం ఆయన మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఆయన స్వేచ్చగా సమీక్ష చేసే పరిస్థితి కూడా లేదు. తన శాఖలకు సంబంధించి ఏదైనా నిర్ణయాలు ప్రెస్మీట్లు పెట్టాలన్న సమాచారం వస్తే మాత్రమే ఆయన తెర ముందుకు వస్తున్నారు. ఆయన ఎక్కువగా విశాఖలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో వ్యూహాత్మకంగా బొత్సను రాజకీయంగా నిర్వీర్యం చేస్తున్నారన్న చర్చ వైసీపీలో జరుగుతోంది.దీన్ని ఎదుర్కోవడానికి బొత్స రాజకీయ అనుభవం సరిపోవడం లేదంటున్నారు.