భారతీయ జనతా పార్టీ మోడీ, షా చేతుల్లోకి వచ్చిన తర్వాత 70ఏళ్లు దాటిన వారికి కీలక పదవులు ఇవ్వడం.. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించడం మానేశారు. ఈ నిబంధన చూపించి అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి లాంటి దిగ్గజాల్ని కూడా పక్కకు తప్పించారు. ఇప్పుడీ నిబంధనతోనే నరేంద్రమోడీకి రిటైర్మెంట్ ఇవ్వాలన్న డిమాండ్ బీజేపీలోనే వినిపించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే నరేంద్రమోడీ వయసు 71 ఏళ్లు. పార్లమెంట్ ఎన్నికలు జరిగే సరికి ఆయన వయసు 73 అవుతుంది. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం బీజేపీ విధానాలకు విరుద్ధమే.
అందుకే గతంలోనే వచ్చే ఎన్నికల్లో మోదీ పోటీ చేయరని… ఆయన రాష్ట్రపతి అవుతారని.. అమిత్ షా ప్రధాని అవుతారన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అమిత్ షా కన్నా యోగినే ఎక్కువగా బీజేపీలోకి దూసుకు వస్తున్నారు. ఇప్పుడు మోదీ తర్వాత భాజపాలో పవర్ఫుల్ లీడర్ ఎవరంటే యోగి పేరే వినిపిస్తోంది. కాబోయే ప్రధానిగా ప్రజలు భావించడం సహజమేనని అమిత్ షా కూడా చెబుతున్నారు. యోగి నాయకత్వంలో ఉత్తర్ప్రదేశ్లో ఎన్నో ఏళ్లుగా లేని అభివృద్ధి జరిగిందని అమిత్ షా చెబుతున్నారు.
2024లో భాజపా మళ్లీ అధికారంలోకి రావాలంటే యూపీలో యోగి ఆదిత్యనాథ్ సాధించిన ఈ గెలుపు చాలా కీలకం కానుంది. యోగికి 49 సంవత్సరాలు మాత్రమే. ఇది కూడా ఆయనకు కలసి రానుంది. వచ్చే కొన్ని రోజుల్లో బీజేపీలో పరిస్థితులు ఎలా ఉంటాయన్నదానిపై యోగికి ప్రమోషన్ ఆధారపడి ఉంటుంది. మోడీ వయసు నిబంధనలకు తనకు వర్తించవని అనుకుంటే… ఆయనే ఉండాలనుకుంటే… యోగి.. 2029కి గురి పెట్టుకోవాలి. అయితే యోగి తన మార్క్ రాజకీయాలు బీజేపీలో చేస్తే మాత్రం… ఊహించనిది జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.