శ్రీవారి సేవలో.. నిత్యం గోవిందనామ స్మరణ చేసుకోవాల్సిన వ్యక్తి ఇప్పుడు రాజకీయ క్రీడలో…పావుగా మారి సంచలనాలకు కారణమవుతున్నారు. టీటీడీ ప్రధాన అర్చకులుగా, ఆగమ సలహాదారుగా ఇరవై నాలుగేళ్ల ఏళ్ల పాటు పని చేసిన రమణ దీక్షితులు.. పని గట్టుకుని లోటస్ పాండ్‌కు వెళ్లి జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. జగన్ తనకు న్యాయం చేస్తారన్న నమ్మకాన్ని రమణదీక్షితులు సమావేశం తర్వాత వ్యక్తం చేశారు. ఇంతకీ రమణదీక్షితులు ఏ విషయంలో జగన్ వద్దకు న్యాయంకోసం వెళ్లారు..? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఎలాంటి న్యాయం చేస్తారు..? అసలు జగన్‌ను కలవమని… రమణదీక్షితులకు సూచించింది ఎవరు..?
తెలుగుదేశం పార్టీ అత్యంత విస్త్రతంగా జన బాహుళ్యంలోకి తీసుకువెళ్తున్న “ఆపరేషన్ గరుడ” నిజంగా ఉందో లేదో కానీ.. ప్రజల్లో మాత్రం.. నిజమే అనుకునేలా అనుమానాలు బలపడే ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇరవై నాలుగేళ్ల పాటు శ్రీవారి ఆలయ వ్యవహారాలన్నీ చూసిన వ్యక్తి.. ఇంకా పదవిలో ఉండగానే.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వచ్చి కలసి వెళ్లగానే… పొరుగు రాష్ట్రానికి వెళ్లి మరీ ఆరోపణలు గుప్పించారు. అసలు విషయం ఏమిటంటే.. తాను ఆరోపణలు చేసిన టీటీడీలోనే తాను ఓ ముఖ్యమైన వ్యవస్థ. తన ఆధ్వర్యంలో నడిచే పూజాకైంకర్యాలు, ఆగమ నిబంధనల పాటింపుపైనా విమర్శలు చేశారు. రమణదీక్షితుల ఆరోపణలు విన్న వారికి… వాటిలో ఇసుమంత కూడా నిజం ఉందన్న భావన కలగలేదు. రాజకీయం కోసమే..అంతా చేస్తున్నారన్న భావన వచ్చేసింది. అందుకే శ్రీవారి భక్తులు కూడా ఇదో రాజకీయ క్రీడగా భావించారు తప్ప.. దేవునితో ముడిపెట్టుకోలేదు. కానీ రమణదీక్షితులు.. తన విమర్శల పర్వాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోయారు తప్ప.. వెనక్కి తగ్గలేదు.
రమణ దీక్షితుల వెనుక ఎవరో ఉన్నారని మాత్రం ప్రజలు గట్టిగా నమ్మారు. ఆ ఎవరో…? ఎవరంటే.. బీజేపీ.. దాని రహస్య మిత్రపక్షం వైసీపీ. దీనిపై రమణదీక్షితులే నేరుగా క్లారిటీ ఇచ్చారు. లోటస్‌పాండ్‌లో జగన్‌తో సమావేశమై తన రాజకీయ ఎజెండాను బయటపెట్టేసుకున్నారు. మిరాశీ వ్యవస్థ కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన చెప్పుకొచ్చారు. దానికి వైఎస్ జగన్ ఎలాంటి సాయం చేస్తారో ఆయన చెప్పలేకపోయారు. సరే వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడు.. అధికారంలోకి వస్తాడు.. న్యాయం చేస్తాడనుకుంటే.. అప్పుడే ప్రయత్నించవచ్చు కదా. ఇప్పుడే ఉన్న పళంగా కోర్టుకు హాజరయ్యే నిమిత్తం హైదరాబాద్ వచ్చిన జగన్‌తో సమావేశమవ్వాల్సిన అవసరం ఏముంది..?
టీటీడీ విషయంలో రమణదీక్షితులు తప్పు చేస్తున్నారని ఇప్పుడు ప్రజలు బలంగా నమ్మే పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం పార్టీ నేతలు అసలు కుట్రకు మరిన్ని కోణాలు జోడించి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కరుడు గట్టిన హిందూ వాదులు కడా… రమణదీక్షితులు జగన్ ఇంటికి వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. లోటస్ పాండ్ లో జగన్ నివాసంలో ముందు భాగంలో నిలువెత్తు శిలువ ఉంటుంది.ఇంట్లో చర్చి ఉంటుంది. ప్రతీ రోజూ అక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి.అలాంటి చోటికి.. రమణ దీక్షితులు వెళ్లకుండా ఉండాల్సిందన్న భావన హిందూ మత పెద్దల్లో వ్యక్తమవుతోంది.