కర్ణాటక ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలు కూడా స్పందిస్తున్నాయి. ఎవరి అజెండాలతోవారు ఆ రాష్ట్ర ఎన్నికలపై ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ప్రధాని దేవెగౌడని కలిసొచ్చారు. అవసరమైతే జేడీఎస్ తరఫున కర్ణాటకలో ప్రచారం చేసేందుకు వస్తానని కూడా చెప్పారు. ఇక, ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం కూడా ఆ రాష్ట్ర ఎన్నికలపై దృష్టి సారించింది. తెలుగు ప్రజలు స్థిరపడ్డ ప్రాంతాల్లో ప్రచారం చేసేందుకు టీడీపీ కూడా సిద్ధంగా ఉంది. కర్ణాటకలో తెలుగువారి సంఖ్య గణనీయంగా ఉంది. దాదాపు ముప్ఫైకి పైగా నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. కాబట్టి, తెరాస టీడీపీలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.
కేసీఆర్ లక్ష్యం భాజపాయేతర, కాంగ్రెసేతర ఫ్రెంట్ ఏర్పాటు. దానికి దేవెగౌడ మద్దతు కావాలి. అందుకే, ఆయన కర్ణాటక ఎన్నికల్లో జెడీఎస్ కి మద్దతు ఇవ్వాలని అక్కడి తెలుగు ప్రజలను కోరారు. ఇక, టీడీపీ పోరాటం హోదా కోసం కాబట్టి, కర్ణాటకలో బీజేపీని ఓడించాలంటూ ఆ పార్టీ ప్రచారానికి సిద్ధమౌతోంది. నిజానికి, కేసీఆర్ ఫ్రెంట్ ఏర్పాటు కంటే… టీడీపీ మొదలుపెడుతున్న ప్రచారమే భాజపాకి మింగుడుపడటం లేదని చెప్పాలి. ఏపీలో హామీలపై స్పందించకపోతే… ఆ ప్రభావం పక్క రాష్ట్రాల్లో ఉండదని వారు అనుకున్నారు. అనూహ్యంగా తెలుగువారు స్థిరపడ్డ ప్రాంతాల్లో కూడా తమకు వ్యతిరేకత తప్పదనేది అంచనా వేయలేకపోయారు. అయితే, ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి స్పందన ఎలా ఉండబోతుందా అనేది చర్చనీయం అవుతోంది.
నిజానికి, బెంగళూరుతో జగన్ కి బాగానే సంబంధాలున్నాయి! కొన్నేళ్లపాటు ఆయన అక్కడే ఉన్నారు. రాయలసీమ ప్రాంతం నుంచి అత్యధికంగా బెంగళూరుకు వలస వెళ్లి స్థిరపడ్డవారూ ఉన్నారు. అలాంటి ప్రాంతాల్లో జగన్ పర్యటించి భాజపా వ్యతిరేక పోరాటం చెయ్యొచ్చు. సొంత రాష్ట్రానికి అన్యాయం జరిగిందనీ, హోదా ఇవ్వని భాజపాకి ఓటెయ్యద్దని అక్కడి తెలుగువారికి విజ్ఞప్తి చెయ్యొచ్చు. అది కూడా హోదా సాధన పోరాటంలో భాగమే కదా. కేంద్రంపై ఒత్తిడి పెంచే మరో మార్గమే ఇది. కానీ, ఈ దిశగా జగన్ స్పందన ఎలా ఉంటుందీ, అసలు స్పందన ఉంటుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. హోదా పోరాటంలో మొదట్నుంచీ గమనిస్తే, భాజపా లక్ష్యంగా వైకాపా ప్రయత్నం ఉండటం లేదు. భాజపాని విమర్శించాలంటే ఇప్పటికీ వైకాపా నేతలు సన్నాయి నొక్కులే నొక్కుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని అధికార పార్టీపై ఒత్తిడి పెంచే అవకాశాన్ని వైకాపా పరిగణనలోకి తీసుకుంటుందా లేదా అనేది వేచిచూడాలి.