ఏపీలో ముఫ్పైఏళ్లు మాదే అధికారం . మేం ఏం చేసినా తిరుగులేదు అనే ఉద్దేశంతోనే వైసీపీ అధినేత విచ్చలవిడి నిర్ణయాలు తీసుకుంటున్నారన్న అభిప్రాయాలు వైసీపీ క్యాడర్లో ఉంది. ప్రజాస్వామ్యంలో శాశ్వతం అనే పదానికి అర్థం లేదని అందరికీ తెలుసు. కానీ విచిత్రం ఏమిటో కానీ అధికారం అనుభవిస్తున్న వారు ఎవరూ అంగీకరించరు. తమ అధికారం శాశ్వతం అనే ఆశల్లో ఉంటారు. అలాంటి ఊహల నుంచే వచ్చే నియంతృత్వమే ఇప్పుడు ఏపీలో కనిపిస్తోంది. అయితే బయట నుంచి చూసే వారికి మాత్రం ఆ కోట కూలిపోతోందన్న అనుమానం వస్తోంది. ఆ విషయాన్ని సీఎం జగన్ సోదరి షర్మిల కూడా చెబుతున్నారు.
ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై స్పందించిన ఆమె రేపు వచ్చే ప్రభుత్వం ప్రభుత్వం వైఎస్ఆర్ పేరు తీసేస్తుందని అది ..ఆయనకు అవమానకరం అన్నారు. అంటే.. ప్రభుత్వం మారుతుందని షర్మిల కూడా గట్టి నమ్మకంతో ఉన్నారన్నమాట. ఎవరైనా ఈ మాట అంటే వైసీపీ నేతలు … ప్రభుత్వం మారుతుందా.. అని వికటట్టాహాసం చేస్తారు. అది అధికారం నెత్తికెక్కిన అహంకారం. కానీ గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ కోసం ప్రచారం చేసి.. జగన్ కోసం ఊరూవాడా ప్రచారం చేసిన షర్మిల ఇప్పుడు ప్రభుత్వం మారుతుందని చెప్పడం వైసీపీ నేతలకు నచ్చకపోవచ్చు. కానీ వాస్తవాల్ని అంగీకరించలేనప్పుడు.. అనుభవమైనప్పుడే అసలు తత్వం బోధపడుతుంది.
ఏపీ ప్రభుత్వ తీరు.. వ్యవహారశైలిపై మధ్యతరగతి వర్గం రగిలిపోతోంది. లబ్దిదారులు కూడా తాము అప్పుల పాలైపోతున్నామని.. ప్రభుత్వం ఇచ్చే కొద్ది మొత్తం ఏ మూలకు సరిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా సొమ్ములు పిండి మాకే ఇస్తున్నారన్న అభిప్రాయానికి వస్తుంది. ఇవన్నీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి.