ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో వస్తున్న అనూహ్య పరిణమాలు… ఎవర్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ప్రమేయం ఎలాంటి ఫలితాలను ఇచ్చిందో చూసిన తర్వాత.. ఏపీ రాజకీయాల్లో .. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమేయాన్ని ఎవరూ పాజిటివ్ గా తీసుకునే అవకాశం లేదు. అసలు ఏపీ రాజకీయాల వైపు .. కేసీఆర్ చూస్తారని ఎవరూ అనుకోలేదు. ఆయన చూసినా.. ఆయనతో అందరూ అంటీముట్టనట్లే ఉంటారని అనుకున్నారు. ఎందుకంటే.. ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ ప్రమేయాన్ని ప్రజలు .. అహ్వానించే పరిస్థితి ఉండదు. కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికి కూడా.. ఈ క్లారిటీ ఉంది. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. చాలా భిన్నంగా ఆలోచిస్తున్నారు. వ్యతిరేకత దిశలో రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయంగా ఎలాంటి లాభం ఉండదని తెలిసినా.. టీఆర్ఎస్ను పట్టుబట్టి తీసుకొస్తున్నారు.
జగన్ రాజకీయ అడుగులపై… వైసీపీ నేతల్లోనే గందరగోళం నెలకొంది. అధినేత మాట జవదాటే పరిస్థితి ఏ ప్రాంతీయ పార్టీలోనూ ఉండదు. వైసీపీలోనూ అదే పరిస్థితి ఉంది. జగన్ ఏం చేస్తే.. దాన్ని సమర్థిస్తూ మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. కానీ.. వైసీపీలో ఎప్పుడూ.. ఏదైనా.. ఎవరైనా మాట్లాడాలంటే.. ముందుగా స్క్రిప్ట్ వస్తుంది. దాని ప్రకారమే మాట్లాడాలి. బయట విడిగా మాట్లాడితే.. దానికి విలువ ఉండదు. సాక్షి మీడియాలో ప్రయారిటీ దక్కదు. అందుకే.. ఎవరూ పెద్దగా మాట్లాడరు. అయితే… అంతర్గతంగా మాత్రం.. కేటీఆర్, జగన్ భేటీలపై మాత్రం చర్చ జరుగుతోంది. జగన్ తీరుపై.. ఆయా నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేసీఆర్ చంద్రబాబుకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ కచ్చితంగా.. ఏపీలో టీడీపీ గెలుపే అవుతుందని.. ఆ ట్రాప్లో జగన్ పడిపోయారన్న చర్చ జరుగుతోంది. కేసీఆర్.. కేసుల్లాంటి వాటిలో చిన్న చిన్న సాయాలు చేసి.. జగన్ ను… పూర్తిగా… ట్రాప్ లో పడేశారని.. ఆయన ఫెడరల్ ఫ్రంట్ కోసం… తెలంగాణలోని వైఎస్ అభిమానుల మద్దతు కోసం… జగన్ ను ఏపీలో ముంచేయడానికి సిద్ధపడుతున్నారని.. ఆ విషయం జగన్ అర్థం చేసుకోలేకపోతున్నారన్న ఆవేదన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది.
కేటీఆర్, జగన్ భేటీ తర్వాత సోషల్ మీడియాలో.. వైసీపీపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. డిఫెండ్ చేసుకోవడానికి వైసీపీ నేతలు పడిన తంటాలు… అన్నీ ఇన్నీకావు. చివరికి సాక్షి మీడియాలో అది కేవలం… ఫెడరల్ ఫ్రంట్ భేటీనే అని చెప్పేందుకు తంటాలు పడ్డారు. కానీ… ప్రజల్లోకి మాత్రం.. వేరే విధంగా వెళ్తోంది. వివరణ ఇచ్చుకోవడానికి.. ఎదురుదాడి చేయడానికి కూడా వైసీపీ సోషల్ మీడియా టీంకు… సరైన బేస్ దొరకలేదు. ఇదే పరిస్థితి ద్వితీయ శ్రేణి నేతల్లోనూ ఉంది. తటస్థ ఓటర్ల మనసుల్లోకి జగన్ వ్యవహారాలు బలంగా వెళ్తాయని.. అది పార్టీకి దెబ్బైపోతుందని నమ్ముతున్నారు.