వచ్చే నెల ఆరో తేదీ నుంచి పదిరోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఒకవేళ ముందస్తు ఎన్నికలంటూ ఉంటే… ఇదే చివరి సమావేశాలు అనుకోవచ్చు. అలాంటి పరిస్థితి లేకపోతే ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. ఈ దఫా కూడా గత సమావేశాలు మాదిరిగానే అధికార పార్టీ టీడీపీ పూర్తిగా ఏకపక్షంగా నిర్వహించే అవకాశాలే కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని వివరించడంతోపాటు… ప్రత్యేక ప్యాకేజీ కాదని, హోదా కోసం పోరాటం ఎందుకు చేయాల్సి వస్తోందో మరోసారి ప్రజలకు చెప్పుకునే అవకాశంగానే ఈ సమావేశాలను వినియోగించుకుంటుంది. ఎన్నికల ముందు ప్రజలకు ఏం చెప్పాలనే అజెండాను తాజా సమావేశాల కోసం అధికార పార్టీ తయారు చేసుకుంటున్నట్టు సమాచారం.
ఇక, ప్రతిపక్ష వైకాపా ఈ సమావేశాలకు కూడా హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు! ఇప్పటికీ, పాతపాటే పాడుతూ.. ప్రజల్లో ఉంటూనే సమస్యలపై పోరాటం అనే వైఖరే కనిపిస్తోంది. నిజానికి, కనీసం ఇప్పుడైనా ఆ నిర్ణయాన్ని కాస్త పక్కనపెట్టి సభకు వస్తే అన్ని రకాలుగా వైకాపాకి ప్లస్ అయ్యే అవకాశమే ఉంటుంది. అసెంబ్లీకి హాజరుకాకపోవడం ప్రతిపక్ష నేతగా జగన్ కు మైనస్సే అవుతోంది. పైగా, ఎంపీలతో రాజీనామాలు చేయించి ఏమీ సాధించలేకపోయారనే ఇమేజ్ ప్రస్తుతం వైకాపాని ఇబ్బంది పెడుతున్న అంశం. కీలక సమయంలో పార్లమెంటులో తమ వాణిని వినిపించడంలో జగన్ పార్టీ ఫెయిలందనే చర్చ బాగానే జరిగింది. దీంతో, తాజా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైకాపా గైర్హాజరీపై మరోసారి చర్చ జరిగే అవకాశం ఉంది. గడచిన సెషన్స్ కి దూరంగా ఉండటం వల్ల వైకాపా ఏం సాధించిందనే చర్చకూ మరింత ఆస్కారం కనిపిస్తోంది.
ప్రధాన ప్రతిపక్షం సభలో లేకపోవడాన్ని భాజపా కొంత అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశం ఉంది. వారికి సరైన సంఖ్యాబలం లేకపోయినా, ఉన్న కొద్దిమంది సభ్యులూ గత సమావేశాల్లో ప్రతిపక్ష పాత్ర పోషించారు. పైగా, కేంద్రంపై టీడీపీ అవిశ్వాసం పెట్టిన తరువాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు కాబట్టి… ఈసారి భాజపా సభ్యుల మరింత ప్రిపేర్డ్ గా సభకు వస్తారు. ఏదేమైనా, తాజా సమావేశాల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ పాత్ర ఏంటనేది ప్రధానంగా ప్రజల్లో చర్చనీయం అవుతుంది. సమావేశాలను బహిష్కరించడం వల్ల వైకాపా ఇన్నాళ్లలో సాధించింది ఏంటనేది ప్రజలకు వివరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.