ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధానికి మూల కారణాలను విశ్లేషించుకోవడంలో భాగంగా ప్రాచీన కాలంలో ఈ ప్రాంతం ఏ విధంగా యూదా రాజ్యాం గా ఉండేది, 7వ శతాబ్దం అనంతరం ఇస్లాం పాలకుల చేతికి ఏ విధంగా వచ్చిందీ, 16వ శతాబ్దంలో ఓట్టమన్ సామ్రాజ్యంలో భాగంగా మారిందీ, మొదటి ప్రపంచ యుద్దం తర్వాత ఈ ప్రాంతం ఏ విధంగా బ్రిటన్ చేతిలోకి వచ్చిందీ గత ఆర్టికల్స్ లో పరిశీలించాం. అదే విధంగా హిట్లర్ జర్మనీ లో యూదులను ఏ విధంగా ఊచకోత చేసింది కూడా గత ఆర్టికల్స్ లో పరిశీలించాం. ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం, ఇజ్రాయిల్ ప్రత్యేక దేశం ఏర్పాటు కి ఏ రకంగా ఊపిరులూదిందో చూద్దాం.
రెండవ ప్రపంచ యుద్ధం (1939-45):
ప్రపంచ గతిని మార్చివేసి ప్రపంచ చరిత్ర ని తీవ్రం గా ప్రభావితం చేసిన రెండవ ప్రపంచ యుద్ధం Axis powers మరియు Allies powers మధ్య జరిగింది. Axis powers కూటమి లో జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలు ఉంటే Allies లో అమెరికా బ్రిటన్ రష్యా మరియు చైనా లాంటి పెద్ద దేశాలు ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత గెలిచిన దేశాలు ఓడిపోయిన దేశాల మీద కఠినమైన ఆంక్షలు కలిగిన ఒప్పందాలను ( Versailles treaty లాంటివి ) రుద్దడం ఈ యుద్దానికి ఒక ప్రత్యక్ష కారణం అయితే, కొన్ని పరోక్ష కారణాలు కూడా ఉన్నాయి. ప్రపంచ చరిత్ర లో అతి పెద్ద ఆర్థిక మాంద్యం అయిన 1929 గ్రేట్ డిప్రెషన్ క్యాపిటలిస్ట్ దేశాల ని ఆర్థికంగా నడ్డి విరిచిన తర్వాత, ఆ దేశాల కంటే నియంతృత్వ పాలనలో ఉన్న జర్మనీ, ఇటలీ లాంటి దేశాలు ప్రజలకు మెరుగైన పాలన ఇస్తున్నాయనే భావన బలపడింది. ఇది ఆయా నియంతలలో సామ్రాజ్య విస్తరణ కాంక్ష పెంచింది. ఇదే సమయం లో పలు రాజకీయ పరిణామాలు – స్పానిష్ అంతర్యుద్దం, చైనా పై జపాన్ దురాక్రమణ, పోలండ్ పై జర్మనీ దండ యాత్ర లాంటివి రెండవ ప్రపంచ యుద్దానికి దారి తీసాయి. నియంతృత్వ దేశాలైన జర్మనీ ఇటలీ, వాటితో జత కలిసిన జపాన్ ల పై – బిగ్ ఫోర్ దేశాలైన యూఎస్, యూకె, చైనా, రష్యా లు ఈ యుద్దం లో విజయం సాధించాయి.
యూదుల పై ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తిన సానుభూతి:
యూదులని హిట్లర్ ఏ స్థాయి లో హింసించాడో, ఎలా ఊచకోత కోసి సుమారు 60 లక్షల మంది ని చంపించాడొ గత ఆర్టికల్ లో తెలుసుకున్నాం. రెండో ప్రపంచ యుద్ధ సమయం లో అమెరికా మిలిటరీ దళాలు జర్మనీ లో యూదులను హిట్లర్ హింసిస్తున్న తీరు ని స్వయంగా పరిశీలించిన తర్వాత ఆ పరిస్థితులను ప్రపంచానికి తెలియజేశాయి. దీంతో అమెరికా సహా అనేక దేశాలలో యూదుల పట్ల సానుభూతి పెల్లుబికింది. అమెరికా లోని సెనేటర్లు, కాంగ్రెస్ మెన్ యూదుల పక్షాన బలంగా లాబీయింగ్ చేసారు. అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ ట్రూమన్, పాలస్తీనాను పాలిస్తున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి, హిట్లర్ ఊచకోత నుండి తప్పించుకున్న సుమారు లక్ష మంది యూదులను పాలస్తీనా లోకి అనుమతించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా భవిష్యత్తు లో వేరు వేరు ప్రాంతాల నుండి పాలస్తీనాకు వచ్చే యూదులని అడ్డగించవద్దని కోరారు. దీనికి బ్రిటన్ సమ్మతించింది.
పాలస్తీనా కి తిరిగి వచ్చిన లక్షలాది మంది యూదులు, ఎటు చూసినా అల్లర్లు, ఉద్రిక్తతలు
దీంతో ఒక్కసారిగా పాలస్తినావాసులు, పాలస్తీనాకు మద్దతిస్తున్న పొరుగు ముస్లిం దేశాలు అలర్ట్ అయ్యాయి. హిట్లర్ దాష్టీకానికి గురైన యూదుల పట్ల తమకు కూడా సానుభూతి ఉందని, అంత మాత్రం చేత యూదులని పాలస్తీనాకు పంపడానికి తాము అంగీకరించమని తేల్చి చెప్పాయి పొరుగు ముస్లిం దేశాలు. దీంతో ఈ ప్రాంతం లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక వైపు వేరు వేరు దేశాల నుండి వచ్చే యూదులు వస్తూనే ఉన్నారు, మరొకవైపు ఎక్కడ చూసినా హింస అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. చూస్తుండగానే పరిస్థితులు చేజారిపోయాయి.
నిజానికి ఆ సమయానికి ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వారే పాలిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఇండియా కి స్వాతంత్రం ఇవ్వడం, భారత్ పాకిస్తాన్ విభజన వంటి అనేక ఇతర అంశాల్లో బిజీగా ఉన్న బ్రిటిష్ వారు పాలస్తినా లో తమ మిలిటరీ ఖర్చులు తగ్గించుకునే ఉద్దేశంతో ఉన్నారు. దీంతో ఇజ్రాయిల్ పాలస్తీనా సమస్య ను పరిష్కరించడానికి తమ వైపు నుండి కృషి చేయకుండా ఐక్యరాజ్యసమితికి సిఫారసు చేసి చేతులు దులిపేసుకున్నారు. బ్రిటిష్ వారు భారత్ కి స్వాతంత్ర్యం ఇచ్చేటపుడు కూడా – కాశ్మీర్, ప్రిన్స్లీ స్టేట్స్, నదీ జలాల విభజన వంటి అనేక సమస్యలని ఎక్కడివక్కడే వదిలేసి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.
1948 ఐక్యరాజ్యసమితి తీర్మానం:
1947 చివర లో ఐక్యరాజ్య సమితి తన తీర్మానాన్ని ప్రకటించింది. జియోనిజం ఉద్యమ సమయం (1897) నుండి తమకంటూ ఒక హోం ల్యాండ్ ఉండాలని పరితపించిన యూదుల స్వప్నం సాకారం చేసింది ఈ తీర్మానం. ఈ తీర్మానం యూదుల కల ని సాకారం అయితే చేసింది కానీ పాలస్తీనా భవిష్యత్తుని తల్లక్రిందులు చేసింది. పాలస్తీనా శరణార్థుల సమస్య సృష్టించబడేలా చేసింది. 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రాంతం లో నిప్పుల వర్షం, నెత్తుటి ధారలు నిత్య కృత్యం అయేలా చేసింది. మరి ఇంతలా ఆ తీర్మానం లో ఏముందీ తదుపరి ఆర్టికల్ లో కూలంకషంగా పరిశీలిద్దాం.
(సశేషం)
– జురాన్ (@CriticZuran)
Also Read చరిత్ర పుటలు: ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం, కారణాలు, సమగ్ర విశ్లేషణ (పార్ట్-1)
Also Read ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం (పార్ట్-2) : ప్రాచీన కాలంలో ఈ ప్రాంతం ఒక యూదా రాజ్యం
Also Read ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం (పార్ట్-3) : యూదా రాజ్యం అరబ్బుల పాలస్తీనా ప్రాంతం గా ఎలా మారింది ?
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -4): మొదటి ప్రపంచ యుద్ధం, బ్రిటిష్ ఆధీనంలోనికి ఈ ప్రాంతం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -5) : మొదటి ప్రపంచ యుద్ధాంతర పరిస్థితులు, హిట్లర్, యూదుల ఊచకోత
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ -6) : రెండో ప్రపంచ యుద్ధం, ఇజ్రాయెల్ ఏర్పాటుకి మార్గం సుగమం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ – 8): పాలస్తీనా శరణార్థుల సమస్య
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ( పార్ట్ – 9): ఆరు రోజుల యుద్ధం , శిబిరాల్లో శరణార్థుల జీవితం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం (పార్ట్-10): యాసర్ అరాఫత్ అను ఒక విరోధాభాసం
Also Read ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం (పార్ట్-11): ఓస్లో ఒప్పందాలు, పాలస్తీనా విమోచన, అరాఫత్ ప్రభుత్వం