రేటింగ్: 2.5
అదేంటో గానీ…. కొన్ని సినిమాల టైటిళ్లకీ, ఆ కథకూ, క్యారెక్టరైజేషన్లకూ ఎలాంటి సంబంధం ఉండదు. కథొకటి, టైటిల్ ఒకటి. `ఇష్క్` అలాంటిదే. ఈ టైటిల్ వినగానే లవ్ స్టోరీ అనుకుంటారంతా. చిత్రబృందం మాత్రం `ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ` అనే ట్యాగ్ లైన్ తగిలించి కాస్త అప్రమత్తం చేయాలని చూసింది. సిగరెట్ కంపెనీ పేరు పెద్ద పెద్ద అక్షరాలతోనూ, `పొగత్రాగడం హానికరం` అనే ప్రమాద ఘంటికలు చిన్న చిన్న అక్షరాలలో పేర్చినట్టు… అందరికీ టైటిల్ కనిపించింది తప్ప, కింద ఉన్న ట్యాగ్ లైన్ పై దృష్టి పోలేదు. కాబట్టి.. ఇష్క్ అంటే లవ్ స్టోరీనే అనుకుంటారు. కానీ లోపల ఉన్న మేటర్ వేరు. సూపర్ గుడ్ ఫిల్మ్ నుంచి వచ్చిన ఈ `ఇష్క్` అసలు కథేంటి? ఇందులో ఉన్న మేటరేంటి?
సిద్దు (తేజ సజ్జ) అనసూయ (ప్రియాంక వారియర్) ఇద్దరూ ప్రేమించుకుంటాడు. అను పుట్టిన రోజు సందర్భంగా ఓ చిన్న ట్రీట్ ప్లాన్ చేస్తాడు సిద్దు. తనని సిటీ అవుట్ కట్స్కి తీసుకెళ్లి.. బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనుకుంటారు. అలా.. సిద్దూ, అను ఇద్దరూ డేట్ కి బయల్దేరతారు. ఓ చోట కారు ఆపి, మంచి రొమాంటిక్ మూడ్ లో వెళ్తుండగా… మాధవ్ (రవీందర్) అనే పోలీస్ ఎంట్రీ ఇస్తాడు. వీరిద్దరి ముద్దు సీను.. ఫోనులో బంధించి బ్లాక్ మెయిల్ చేయడం మొదలెడతాడు. సిద్దు, అనులను ఇష్టానుసారంగా హింసిస్తాడు. ఇద్దరిపై తన సైకోయిజం చూపిస్తాడు. అను అయితే చాలా ఇబ్బంది పడిపోతుంది. సిద్దూని కారులోంచి బయటకు పంపి… అనుతో అనుచితంగా ప్రవర్తిస్తాడు మాధవ్. చివరికి డబ్బులు తీసుకుని వదిలేస్తాడు. ఈ మాధవ్ పై.. సిద్దు ఎప్పుడు, ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే `ఇష్క్` కథ.
ముందే చెప్పినట్టు `ఇష్క్` ప్రేమ కథ కాదు. ప్రేమ జంటకు జరిగిన అవమానం. అందుకు హీరో ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే కథ. ఇది తెలుగు కథ కాదు.తమిళం నుంచి రీమేక్ చేసింది. ఈ సినిమా చూశాక… రీమేక్ చేయాలి అన్నంతగా ప్రేరేపించిన పాయింట్ అంతగా ఏముందబ్బా? అనిపిస్తుంది. బహుశా.. తక్కువ పాత్రలు, తక్కువ లొకేషన్లు, తక్కువ బడ్జెట్ లో అయిపోయే కథ కాబట్టి… సూపర్ గుడ్ ఫిల్మ్స్.. ఉత్సాహం చూపించి ఉంటుంది. సినిమా మొదలైన 45 నిమిషాలకే ఇంట్రవెల్ కార్డు పడిపోతుంది. దాంతో ప్రేక్షకులకే ఓ రకమైన షాక్. `ఇప్పటి వరకూ ఏం జరిగిందని, ఇంట్రవెల్` అనిపిస్తుంది. నిజానికి తెరపై చాలా జరిగినా.. మొత్తంగా సీన్లు మాత్రం మూడే. దాన్ని బట్టి సీన్లు ఎంత సుదీర్ఘంగా సాగాయో అర్థం చేసుకోవొచ్చు.
హీరో, హీరోయిన్లు కార్లో కూర్చుని ముద్దు పెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు.. కనీసం పది నిమిషాలైనా సాగదీశాడు. ఓ దశలో `ఆ ముద్దేదో పెట్టేసుకోండ్రాబాబూ..` అన్నంత అసహనం ప్రేక్షకుడికి కలుగుతుందంటే… ఆ సన్నివేశాన్ని ఎంతగా లాగారో అర్థం చేసుకోవొచ్చు. మాధవ్ ప్రవేశించాక… కూడా కథ అక్కడే ఉంటుంది. సదరు మాధవ్.. ఈ ప్రేమ జంటని విసిగించే సన్నివేశం దాదాపు 20 నిమిషాల పాటు నిరాటంకంగా సాగుతుంది. ఆ సన్నివేశంలో మాధవ్ అనే పాత్ర చూపించే సైకోయిజం కంటే… హీరో బలహీనతే ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా సినిమాల్లో హీరోలు ఎలా ఉంటారు? తన గాళ్ ఫ్రెండ్ ని ఎవరైనా, ఏమైనా అంటే, ఎంతటివారినైనా ఎదిరించేవాడిలా ఉంటారు. కానీ ఇందులో విరుద్ధంగా చూపించారు. విలన్ ఎంత విసిగించినా హీరో రియాక్ట్ అవ్వడు. అది అత్యంత సహజంగా తీయాలని దర్శకుడు చేసిన ప్రయత్నం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. అంతకు ముందు సీన్ లోనే… ఓ అబ్బాయి తన ప్రేయసిని తినేసేటట్టు చూస్తున్నాడని గ్రహించి వీరలెవిల్లో వార్నింగ్ ఇచ్చొచ్చి, తన హీరోయిజం చూపించుకుంటాడు. అలాంటివాడు… తన కళ్ల ముందు తన ప్రేయసిని మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నా సహనం పాటించడం ఆ క్యారెక్టర్ని రాసుకోవడంలో వైఫల్యాన్ని భూతద్దం పెట్టి మరీ చూపిస్తుంది.
ద్వితీయార్థం మొత్తం హీరో తాలుకూ రివైంజ్ డ్రామా. ఇందులో హీరో ఏం చేశాడంటే, సదరు విలన్ ఎలా తన ప్రేయసి ని ఏడిపించాడో, అలానే విలన్ భార్యని ఏడిపించడం. ఇదేం హీరోయిజమో, ఇదేం రివైంజో అర్థం కాదు. `నువ్వు ఒకరికి చేసిందే మళ్లీ నీకు తిరిగొస్తుంది` అని చెప్పడం కథకుడి ఉద్దేశ్యం కావొచ్చు. కాకపోతే.. ఆ ద్వితీయార్థాన్ని ఇంకాస్త బెటర్ గా ట్రీట్ చేయొచ్చు.ఎలా చూసినా.. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ నే నయం అనిపించేలా ఉంది. క్లైమాక్స్ లో కథకుడు మార్కులు కొట్టేస్తాడు. అక్కడ హీరోయిన్ పాత్రలో.. అమ్మాయిల తాలుకూ ఆత్మాభిమానాన్ని ఫోకస్ చేయగలిగాడు. ఓరకంగా.. ఈ సినిమాకి కాస్త ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చేది క్లైమాక్సే అనుకోవాలి.
తేజని బాలనటుడిగా చూస్తూనే ఉన్నాం. ఈమధ్య హీరోగానూ మెప్పిస్తున్నాడు. తన వరకూ తన పాత్రకు న్యాయం చేశాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో మరింత బాగా నటించాడు. తక్కువ వయసులోనే మెచ్యూరిటీ చూపించాడు. ప్రియావారియర్ బాగుంది. అయితే ఆమెను తొలి సగంలో కార్లోనే బంధించేశారు. సెకండాఫ్ లో తను కనిపించేది ఒకే ఒక్క సీన్ లో. రవీందర్ నటన హైలెట్. తన సైకో, శాడిజం నటనతో ఆకట్టుకున్నాడు. తనకు మరిన్ని మంచి పాత్రలు పడొచ్చు.
ఓ చిన్న కథ ఇది. దాన్ని చాలా పరిమిత బడ్జెట్ లో తీశారు. పాటలకు స్కోప్ లేదు. ఉన్న ఒకే ఒక్క పాట సిద్ శ్రీరామ్ పాడాడు. ఆ పాట బాగుంది. నేపథ్య సంగీతం స్పీడుగా సాగింది. చోటా కె. ఫొటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. తక్కువ బడ్జెట్ లో పూర్తయిన సినిమా ఇది. కాబట్టి ఓ రకంగా నిర్మాతలకు సేఫ్ ప్రాజెక్టే అనుకోవాలి.
ఇలాంటి ఘటనలు నిజ జీవితంలోనూ ఎదురవుతుంటాయి. అప్పుడు కూడా వ్యవస్థపై, మనుషులపై తిరగబడలేని బలహీనత… సగటు మనిషిలో ఉంటుంది. అదే తెరపై కూడా చూపిస్తానంటే కుదరదు. ఎందుకంటే… బయట జరగలేని విషయాలు, జరపలేని పోరాటాలూ తెరపై చూడాలనుకుంటాడు ప్రేక్షకుడు. తెరపై కూడా హీరోని పప్పు శుద్ధగా చూపిస్తామంటే జీర్ణించుకోలేరు. `ఇష్క్`లో ఆ పొరపాటు కనిపించింది.
ఫినిషింగ్ టచ్: ఇష్క్.. రిస్క్ మీదే!
రేటింగ్: 2.5