రేపు దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి సిద్దమవుతున్న ఈ సమయంలో రాజస్థాన్ డుడు జిల్లాలోని ఒక గ్రామంలో మహాత్మా గాంధీజీ విగ్రహం మీద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఐసిస్ జిందాబాద్ అంటూ నినాదాలు వ్రాసి, మొహం మీద నల్లరంగు పూశారు. విగ్రహానికి ముందు వైపు పాకిస్తానీ నిఘా సంస్థ ఐ.ఎస్.ఐ. పేరు వ్రాసారు. విగ్రహం వెనుకవైపు జనవరి 26న అంటే రేపు గణతంత్ర దినోత్సవ వేడుకల సమయంలో పెద్ద విద్వంసం జరుగాబోతోందని హెచ్చరికలు వ్రాసారు. సోమవారం ఉదయం దీనిని గుర్తించిన గ్రామస్తులు వెంటనే ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేయగా, వారు వచ్చి ఆ విగ్రహాన్ని స్వాధీనం చేసుకొన్నారు. వెంటనే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనకు నిరసనగా స్థానిక దుఖాణాలు, సంస్థలు అన్నీ ఈరోజు మూసివేశారు. దేశంలో నలుమూలల ఐసిస్ సానుభూతిపరులు ఎంతగా పెరిగిపోయారో ఈ సంఘటన తెలియజేస్తోంది.