“అమెరికా, యూ ఆర్ నెక్ట్స్”- ఈ ఏడాది మార్చి 29న ఐసిస్ ఉగ్రవాదులు సోషల్ మీడియాలో చేసిన హెచ్చరిక ఇది. ఆ ఉగ్రవాద సంస్థ హెచ్చరికలను ఆన్ లైన్లో వ్యాప్తి చేసే అల్ వఫా ఆంగ్లంలో ఈ సందేశాన్ని ఆన్ లైన్లో వైరల్ అయ్యేలా చేసింది. చెప్పిన ప్రకారమే, ఆదివారం రాత్రి ఆర్లండోలో ఐసిస్ ముష్కరుడు నరమేధం సృష్టించాడు.
బ్రస్సెల్స్ దాడులు ఆరంభం మాత్రమే, అమెరికా యూరప్ లలో పెద్ద ఎత్తున భీకర దాడులు జరుగుతాయని ఐసిస్ మార్చిలో తీవ్రంగా హెచ్చరించింది. పారిస్, బ్రస్సెల్స్, టర్కీ, కాలిఫోర్నియా, ఆర్లండో దాడులను బట్టి, ఐసిస్ హెచ్చరికలు ఆషామాషీ కాదని ఇప్పటికే అర్థమైంది. ఆర్లండో కాల్పులు ఉగ్రవాద దాడేనని ఎఫ్.బి.ఐ. ధ్రువీకరించింది. అది టెర్రరిస్టుల దుశ్చర్యేనని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ప్రకటించారు.
పదిహేనేళ్ల క్రితం, 2011 సెప్టెంబర్ 11న ట్విన్ టవర్స్ పై దాడుల కోసం అల్ ఖైదా బాగా కష్టపడింది. ఉగ్రవాదులు చాలా కాలంపాటు పైలట్ శిక్షణ తీసుకున్నారు. అయితే ఐసిస్ మాత్రం అంత కష్టపడదలచుకోలేదు. అమెరికాలోని గన్ కల్చర్ నే అస్త్రంగా చేసుకుని మారణహోమం సృష్టించడానికి స్కెచ్ వేసినట్టు కనిపిస్తోంది. గత డిసెంబర్లో కాలిఫోర్నియాలో ఓ ముస్లిం జంట జరిపిన కాల్పుల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్లండోలో 50 మంది బలయ్యారు.
భవిష్యత్తులో మరిన్ని దాడులు జరగడం ఖాయమని ఐసిస్ హెచ్చరికలను బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఐరోపా దేశాల్లోనూ నరమేధం సృష్టించడానికి ఉగ్రవాదులు పథకాలు రచిస్తూనే ఉన్నారు. ఆ దేశాల్లోకి వేల సంఖ్యలో వచ్చిన శరణార్థుల మాటున, సిరియా నుంచి ఉగ్రవాదులు కూడా చొరబడ్డాని వార్తలు వచ్చాయి. పారిస్ దాడికి పాల్పడ్డ ఒక ఉగ్రవాది సిరియా నుంచి గ్రీస్ మీదుగా ఫ్రాన్స్ లో చొరబడ్డాడని రూఢి అయింది.
పశ్చిమ దేశాలపై పగబట్టిన ఐసిస్ ముష్కరులు ఆన్ లైన్లో ముస్లిం యువతకు బ్రెయిన్ వాష్ చేసి మోటివేట్ చేయడం ద్వారా దాడులకు ప్రేరేపిస్తున్నారు. ఆర్లండో దాడి అలా జరిగిందే. ఉగ్రవాదానికి సృజనాత్మకతను జోడించిన ఐసిస్, జీహాదీ ఉగ్రవాదులు సిరియా వరకూ రాకుండా తమ దేశంలోనే ఉంటూ, మనసులో విషబీజాలు నాటుకుంటూ దాడులకు సిద్ధమవుతూ ఉంటారు . అదను చూసి పంజా విసరుతారు. సిరియాపై వైమానిక దాడులు జరుగుతున్నా అమెరికా, ఐరోపాలపై ఉగ్రవాదులు పంజా విసరుతూనే ఉన్నారు. చెప్పి మరీ దాడులు చేస్తున్నారు. ఈ ముప్పును ఎదుర్కోవడం పాశ్చాత్య దేశాలకు పెద్ద సవాలే.