పారిస్ లో ISIS ఉగ్రవాద సంస్థ దాడికి దిగిన నేపథ్యంలో ఐఎస్ఐఎస్ అనగానే అంతా హడలిపోతున్నారు. `ఇస్లామిక్ స్టేట్ ఫర్ ఇరాక్ అండ్ సిరియా’ అన్న ఉగ్రవాద సంస్థను ISIS గా చెప్పుకుంటున్నాము. అయితే నిజానికి ఇదే స్పెల్లింగ్ తో ఉన్న పదం (Isis) ఈజిప్ట్ లో ప్రాచీనకాలపు దేవత పేరు కావడం ఇప్పుడు కొత్త ఇబ్బందులను సృష్టిస్తోంది. Isis దేవత ఆరోగ్య ప్రదాయిని. అంతేకాదు, స్త్రీపురుష సంయోగకారిణి, జ్ఞానాన్ని అందించే ఈజిప్ట్ అధిదేవత. ఆ దేవతను ఇంగ్లీష్ లో రాసేటప్పుడు స్పెల్లింగ్ – ISIS. ఇక్కడే చిక్కొచ్చిపడింది. ఐసిస్ అని ఆంగ్లఅక్షరాలు పేరులో ఉన్నందుకు అనుమానించిన ఫేస్ బుక్ సంస్థ ఒక మహిళ ఖాతాను స్తంభింపజేసింది. ఆ తర్వాత తప్పుతెలుసుకుని సరిదిద్దుకుంది. ఈజిప్ట్ దేవత పేరు (Isis) తన షాపుకు పెట్టుకున్నందుకు మరోచోట ఒక పుస్తకాల షాప్ పదేపదే దాడులకు గురికావాల్సి వస్తున్నది.
శాన్ ప్రాన్సిస్కోలో సాప్ట్ వేర్ డెవలపర్ గా ఉన్న ISIS ANCHALEE అనే మహిళకు ఫేస్ బుక్ లో అకౌంట్ ఉంది. యూజర్ నేమ్ గా ISIS గా ఉంచుకుంది. పారిస్ ఉగ్రవాదదాడులు జరిగిన తర్వాత ఫేస్ బుక్ ఈ మహిళ అకౌంట్ ని స్తంభింపజేసింది. దీంతో ఆమె వివరణ ఇచ్చుకున్నాక తన తప్పుతెలుసుకుని ఖాతాను పునరుద్ధరించింది. ఆమె యూజర్ నేమ్ ఉగ్రవాద సంస్థ స్పెల్లింగ్ కు సరిపోవడంతో ఫేస్ బుక్ నిఘానేత్రం ఆమెను టెర్రరిస్ట్ గా భావించి ఖాతాను నిలిపివేసింది. మూడు సార్లు వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్ బుక్ ట్విట్టర్ పేజీ (@facebook)కి ఇస్తేనేకానీ ఐసిస్ తన ఖాతాను మళ్ళీ తెరిపించుకోలేకపోయింది. `ఫేస్ బుక్ నన్ను టెర్రరిస్ట్ అనుకుంది. నా పేరులో Isis ఉండటమే దీనికి కారణం ‘ అంటూ ఆమె ట్వీట్ చేశారు.
కాగా, ఫేస్ బుక్ కి చెందిన రీసెర్చర్ తప్పుసరిదిద్దుకున్న తర్వాత ట్వీట్ చేస్తూ, ఫేక్ అకౌంట్లను గుర్తించే క్రమంలో జరిగిన పొరపాటనీ, ఇబ్బంది కలిగించినందుకు చింతిస్తున్నామనీ, ఆమె అకౌంట్ ని పునరుద్ధరించామని పేర్కొన్నారు.
ఈజిప్ట్ ప్రాచీన నాగరికత పట్ల ఆరాధనఉన్నవాళ్లు చాలామంది ఈజిప్ట్ దేవత Isis (ఐసిస్) పేరుని పిల్లలకు, సంస్థలకు పెట్టుకుంటారు. ఐసిస్ దేవత ఆరోగ్య, స్త్రీపురుష సంయోగకారిణిగానే కాకుండా జ్ఞానప్రదాయినిగా ఆరాధించబడుతోంది. సంతాన దేవత (మన దేశంలో సంతాన లక్ష్మిలాగా)గా కూడా చెప్పుకుంటారు. ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థను ISISగా పిలుస్తుండటంతో ఈ సమస్య వచ్చిపడింది. ముఖ్యంగా మీడియాలో ఐఎస్ఐఎస్ అంటూ పిలవడం మానేయాలంటూ ఐసిస్ బాధితులు కోరుతున్నారు.
ఇక పశ్చిమ అమెరికాలోని కొలొరాడోలోని డెన్వెర్ ప్రాంతంలో చాలాకాలం నుంచి (1980) Isis Books & Gifts పేరిట ఒక షాపు నడుస్తోంది. వీళ్లు కూడా ఈజిప్ట్ దేవత పేరిట షాపుపెట్టుకున్నారు. అయితే ఇప్పుడు షాపు యజమానులు తమది టెర్రరిస్టులు నడుపుతున్న షాపు కాదనీ, ఇక్కడ టెర్రరిస్ట్ భావజాల పుస్తకాలు అమ్మడంలేదంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వస్తున్నది. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థపేరులాగా తమ షాపు పేరు ఉండటంవల్ల క్రిందటేడాది కూడా ఐదుసార్లు దాడులు జరిగాయని ఈ షాపు యజమాని జెఫ్ హారిసన్ అంటున్నారు. ఉగ్రవాద సంస్థ, తమ షాపు పేర్లు ఒకేలా ఉండటంతో ప్రజలు పొరపాటుపడుతున్నారని ఆయన అంటున్నారు. పారిస్ దాడుల తర్వాత ఈ షాపుపై మరోసారి దాడి జరిగింది. ఈ షాప్ లో ఆధ్యాత్మిక, మతపరమైన, ఆరోగ్య గ్రంథాలు అమ్ముతుంటారు.
ఐసిస్ – దేవతకు చాలానే చరిత్ర ఉంది. 3500 సంవత్సరాలకుపైగానే ఆమె ఆరాధించబడుతోంది. అలాంటి పేరు ఇప్పుడు ఉగ్రవాద సంస్థకు సంకేతంగా భావించడం శోచనీయమని షాపు యజమాని అంటున్నారు. అయితే, తమ షాపు పేరు మార్చుకోబోమని చెబుతున్నారు.
మొత్తానికి ఐఎస్ఐఎస్ దాడుల మాట ఎలా ఉన్నా, ఇలా పరోక్షంగా సోషల్ మీడియా ఖాతాదారులు, షాపు యజమానులు ఇబ్బంది పడాల్సివస్తున్నది. ఇప్పటికైనా మీడియా వాళ్లు ఈజిప్ట్ దేవతపేరునీ, ఉగ్రవాద సంస్థ పేరునీ కలగాపులగం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలాగే, చర్యలు తీసుకునేముందు ఈ రెంటిమధ్య ఉన్న తేడాను అధికారులు గుర్తించాల్సిఉంటుంది.
– కణ్వస