పారిస్ నగరంపై ఐసిస్ ఉగ్రవాదులు దాడులు చేసిన తరువాత ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు హోలాండీ మీడియాతో మాట్లాడుతూ ఐసిస్ ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకొంటామని ప్రకటించారు. చెప్పినట్లుగానే ఫ్రాన్స్ వైమానిక దళాలు అమెరికాతో కలిసి సిరియాలోని ఐసిస్ ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తూ అనేకమంది ఐసిస్ ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. అయిన అగ్రరాజ్యాలు తమ వైమానిక దాడులు ఆపకుండా ఇంకా ఉదృతం చేసాయి. ఆ దాడులకు ఐసిస్ ఉగ్రవాదులు కూడా చాలా తీవ్రంగానే స్పందించారు. వాటిని “క్రుసేడర్ క్యాంపెయిన్”గా అభివర్ణించారు. తమపై వైమానిక దాడులకు పాల్పడుతున్న ఫ్రాన్స్, అమెరికాతో సహా ఏ ఒక్క దేశాన్ని కూడా వదిలిపెట్టబోమని ప్రకటించారు. “అల్లా దయతో పారిస్ నగరంలో దాడులు చేసి 129మందిని చంపగలిగాము. మాపై వైమానిక దాడులు చేస్తున్న అమెరికాకి కూడా తగిన గుణపాఠం చెపుతాము. ఈసారి అమెరికాకి గుండెకాయ వంటి వాషింగ్టన్ లో దాడులు చేయబోతున్నాము. అమెరికాతో కలిసి మాపై దాడులు చేస్తున్న అన్ని దేశాలపై కూడా మేము ప్రతీకారం తీర్చుకొంటాము,” అని అల్జేరియాన్ అల్ గరీబ్ అనే ఐసిస్ ఉగ్రవాది ఆ సంస్థ తరపున నిన్న విడుదల చేసిన ఒక వీడియోలో హెచ్చరించాడు.