గత కొంతకాలంగా చాలా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరం మళ్ళీ ఉలిక్కి పడింది. కేంద్ర నిఘావర్గాల అందించిన సమాచారంతో ఎన్.ఐ.ఏ. బృందం, స్థానిక పోలీసులతో కలిసి హైదరాబాద్ పాతబస్తీలో దాడులు చేసి నలుగురు ఐసిస్ ఉగ్రవాద సంస్థ అనుచరులని, భారీగా ప్రేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకొన్నారు. వాటితో హైదరాబాద్ తో సహా దేశంలో పలు ప్రాంతాలలో విద్వంసానికి వారు కుట్ర పన్నుతున్నట్లుగా కనుగొన్నారు. పాక్ నుంచి దేశంలో చొరబడుతున్న ఉగ్రవాదులని అడ్డుకొనేందుకు మన భద్రతాదళాలు రేయింబవళ్ళు సరిహద్దులలో దుర్బరమైన ప్రాంతాలలో కాపలా కాస్తూనే ఉన్నాయి. మన భద్రతాదళాలు సరిహద్దులని ఎంతగా కాపాడుతున్నప్పటికీ, పాక్ ప్రేరిత ఉగ్రవాదులు దేశంలోకి చొరబడుతూనే ఉన్నారు. వారిని అడ్డుకోనేప్రయట్నంలో మన జవాన్లు చనిపోతూనే ఉన్నారు. ఇది ఒక అంతులేని తీవ్ర సమస్యగా ఉంటే ఇటువంటి ఇంటి దొంగలని కనిపెట్టి పట్టుకోవడం మరో పెద్ద సమస్యగా మారింది. పాకిస్తాన్ నుంచి దేశంలో చొరబడుతున్న వారివలన ఎంత ప్రమాదం ఉందో ఇంటి దొంగల వలన కూడా అంతే ప్రమాదం పొంచి ఉందని ఇదివరకు చాలాసార్లు నిరూపితమైంది. అదృష్టవశాత్తు నిఘావర్గాల అప్రమత్తత వలన ఈసారి పెద్ద ప్రమాదం తప్పింది. కానీ మళ్ళీ ఎన్నడూ జరగదని చెప్పలేము.
తెలంగాణాలో తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత పోలీస్ వ్యవస్థలో చాలా మార్పులు చేసి ఆధునీకరించారు. తరచూ కార్బన్ సెర్చ్ పేరిట అనుమానాస్పద ప్రాంతాలలో తనికీలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయినా కూడా ఈరోజు నగరం నడిబోడ్డులో నలుగురు ఉగ్రవాదులు పట్టుబడటం గమనిస్తే ఇంకా నిఘా పెంచవలసిన అవసరం ఉందని, ఇంకా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని స్పష్టం అవుతోంది.