ఇరాక్, సిరియా దేశాలలో ఐసిస్ ఉగ్రవాదులు తమకి పట్టుబడిన బందీల గొంతు కోసి హత్యలు చేస్తూ దానిని వీడియోలో చిత్రీకరించి ఇంటర్నట్ లో పెడుతుండటం తెలిసిందే. ఇప్పుడు భారత్ లో తమ అనుచరుడితో కూడా అదేవిధంగా ఒక ప్రముఖ వ్యాపార వేత్తని హత్య చేయించేందుకు కుట్ర పన్నింది. దానిని ఎన్.ఐ.ఏ. అధికారులు సకాలంలో గుర్తించి, అబూ మూసా అనే ఐసిస్ ఉగ్రవాదిని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బుర్ద్వాన్ రైల్వే స్టేషన్లో బుదవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఒక పొడవైన చాకుని, ఒక పెన్సిల్ టైప్ పాకెట్ వీడియో కెమెరాని స్వాధీనం చేసుకొన్నారు. అతనితో బాటు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వారిని విచారించగా దిగ్బ్రాంతి కలిగించే ఈ విషయాన్ని బయటపెట్టాడు. అతను బంగ్లాదేశ్ లో ఉంటున్న ఒక ఐసిస్ రిక్రూటర్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఒక వ్యాపారవేత్తని హత్య చేసేందుకు బయలుదేరినట్లు అతను చెప్పాడు.
వారం రోజుల క్రితం హైదరాబాద్ పాతబస్తీలో ఐదుగురు ఉగ్రవాదులని ఎన్.ఐ.ఏ. అధికారులు సకాలంలో అరెస్ట్ చేయడంతో పెను ప్రమాదం తప్పిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు తాజాగా ఈ కుట్ర బయటపడింది. అంటే సరిహద్దుల వద్ద మన భద్రతా దళాలు ఎంత కాపలా కాస్తున్నప్పటికీ, ఇటువంటి ఇంటిదొంగలని సకాలంలో గుర్తించి పట్టుకోలేకపోతే, పక్కలో పాములని పెట్టుకొని పడుకొన్నట్లే అవుతుంది.
విశాలమైన భారతదేశంలో అనేక బాషలు, మతాలు, వేషధారణలు కనిపిస్తాయి. అందుకే బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక వంటి దేశాల నుంచి అనేకమంది భారత్ లోకి ప్రవేశించి చాలా సులువుగా స్థానిక ప్రజలలో కలిసిపోగలుగుతున్నారు. అటువంటి వారికి కొందరు పార్టీ నేతలు మద్దతు ఇవ్వడం, వారిని ఎన్.ఐ.ఏ. అరెస్ట్ చేసిన తరువాత కూడా న్యాయసహాయం అందిస్తామని చెప్పడం వలననే ఐసిస్ ఉగ్రవాదం చాప క్రింద నీరులా మెల్లగా విస్తరిస్తోంది. బయట నుంచి వచ్చిన వారి కంటే ఇటువంటి ఇంటి దొంగల వలనే ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని ఈ అరెస్టుల ద్వారా తెలుస్తోంది. కనుక కేంద్రప్రభుత్వంతో సహా అన్నిరాష్ట్రాలు ఈ ఇంటి దొంగలని పట్టుకొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడం చాలా అవసరం.