ఐ.యస్.ఐ.యస్. (ఐసిస్) ఉగ్రవాదులు మరో ఇద్దరు భారతీయులను కిడ్నాప్ చేసారు.వారిలో ఒకరు ఆంద్రప్రదేశ్ కి చెందిన కోసనం రామ్మూర్తి కాగా మరొకరి ఓడిశాకు చెందిన రంజాన్ సమాల్ అని భారత విదేశాంగ శాఖ తెలియజేసింది. ఇదివరకు నలుగురు భారతీయులను కిడ్నాప్ చేసిన లిబియాలోని సిర్తే పట్టణంలోనే మళ్ళీ ఐసిస్ ఉగ్రవాదులు ఇద్దరు భారతీయులను కిడ్నాప్ చేసింది. జూలై 31న కిడ్నాప్ అయిన వారిలో కర్నాటకకు చెందిన ఇద్దరిని విడిచిపెట్టినప్పట్టికీ, తెలుగువారైనా ఇద్దరు ప్రొఫెస్సర్లు గోపీకృష్ణ, బలరామ్ లను ఐసిస్ ఉగ్రవాదులు నేటికీ తన ఆధీనంలోనే ఉంచుకొన్నారు. అప్పటి నుండి వారిని విడిపించేందుకు భారత విదేశాంగ శాఖ అధికారులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఉగ్రవాదులు వారిని విడిచిపెట్టలేదు. కనీసం వారి క్షేమ సమాచారాలు కూడా తెలియకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నాయి.
ఇదివరకు నలుగురు భారతీయులను ఐసిస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినప్పుడే భారతప్రభుత్వం మేల్కొని ఐసిస్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల నుండి భారతీయులను వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేసి ఉండి ఉంటే నేడు మళ్ళీ ఇటువంటి ఘటన పునరావృతం అయ్యేదే కాదు. ఒకవేళ ప్రభుత్వం అశ్రద్ధ చూపినా, ఆ ప్రాంతాలలో పనిచేస్తున్న భారతీయులు దానినొక హెచ్చరికగా భావించి భారత్ కి తిరిగి వచ్చేసి ఉన్నా నేడు ఈ కిడ్నాప్ జరిగే అవకాశం ఉండేది కాదు. కానీ డబ్బుకి ఆశపడి పనిచేస్తున్న భారతీయులు చివరికి ఈ విధంగా ప్రాణాల మీదకు తెచ్చుకొంటున్నారు. బ్రతికుంటే బలిసాకు తినయినా బ్రతకవచ్చు. కానీ ఎంత సంపాదిస్తున్నా ప్రాణాలకే ప్రమాదం అని తెలిసున్నప్పుడు కూడా డబ్బుకి ఆశపడి అటువంటి ప్రమాదకర ప్రాంతాలలో పనిచేయడం పొరపాటు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్నట్లు ఐసిస్ ఉగ్రవాదుల చేతిలో బందీలుగా చిక్కిన భారతీయులను ఆ దేవుడే రక్షించాలని ప్రార్దించడం తప్ప ఇప్పుడు ఎవరు మాత్రం ఏమి చేయగలరు? ఇప్పటికయినా లిబియాలో పనిచేస్తున్న భారతీయులు అందరూ తక్షణమే వెనక్కి తిరిగి వచ్చేస్తే మంచిది. లేకుంటే ఇకపై అప్పుడప్పుడు ఇటువంటి కిడ్నాప్ వార్తలు వింటూనే ఉండవలసి వస్తుంది.